...అండ్ ది ఆస్కార్ గోస్ టు!
బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆ బొమ్మ అంటే అందరికీ అభిమానమే. ఒక్కసారైనా ఆ బొమ్మను దక్కించుకుంటే జీవితానికి ఓ సార్థకత చేకూరినట్లే అని ప్రతి సినీ కళాకారుడూ కోరుకుంటాడు. బంగారు ప్రతిమ దక్కడం అంత సులువు కాదు. అందుకే, దక్కినవారు ప్రపంచాన్ని జయించినంత ఆనందపడిపోతారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 88వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో అలా విజయగర్వం పొందిన విజేతలు చాలామందే ఉన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ ఉత్సవంలో స్వర్ణవర్ణంలో మెరిసిపోయిన ఆస్కార్‌ను అందుకుని, ఉద్వేగానికి లోనైనవారి జాబితా ఎక్కువే.
కళ్లు చెదిరే అందంతో ముస్తాబై వచ్చిన తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ రాక్ ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యహరించారు. ఇక.. ఆస్కార్ వేడుక విశేషాలు తెలుసుకుందాం...
♦ అరడజను ఆస్కార్లతో ‘మ్యాడ్ మ్యాక్స్’ పండగ
♦ ముచ్చటగా మూడు ఆస్కార్లతో ‘రెవనెంట్’
♦ 87 ఏళ్ల ఎన్నీ మార్కొనీ (సంగీత దర్శకుడు)కి తొలి ఆస్కార్
ఉత్తమ చిత్రం: స్పాట్లైట్
నటుడు: లియోనార్డో డికాప్రియో
నటి: బ్రీ లార్సెన్
దర్శకుడు: అలెజాండ్రో
సహాయనటుడు: మార్క్ రెలైన్స్
సహాయనటి: అలీషియా
ఛాయాగ్రహణం: ఎమాన్యుల్
ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరెట్
కాస్ట్యూమ్ డిజైనర్: జెన్నీ బెవాన్
ఉత్తమ చిత్రకథ ఇదే: ‘ఉత్తమ’ చిత్రంగా ఆస్కార్ గెల్చుకున్న ‘స్పాట్లైట్’ కథలోకి వస్తే... బోస్టన్లోని క్యాథలిక్ చర్చిల్లో పిల్లలపై 90 మంది పాస్టర్లు అత్యాచారం జరుపుతారు. వారి చీకటి జీవితాలను ప్రపంచానికి చూపించడానికి ‘బోస్టన్ గ్లోబ్’ పత్రికా రిపోర్టర్ మైఖేల్ రెజెండస్ తన సహోద్యోగులతో కలిసి చేసిన పోరాటమే ‘స్పాట్లైట్’ చిత్రం. 2001లో జరిగిన ఈ యథార్థ ఘటనకు తెర రూపం ఇచ్చారు నటుడు,దర్శకుడు టామ్ మెకార్తి. ఆస్కార్ సాధించిన మొదటి ఇన్వెగెస్టిగేటివ్ జర్నలిస్ట్ మూవీగా చరిత్రకెక్కింది. దర్శకుడు టామ్ మెకార్తి రెండో నామినేషన్లోనే తొలి ఆస్కార్‌ను సాధించారు.
జాతి వివక్ష ఉంటే.. నాకెలా చాన్స్ దక్కేది: వ్యాఖ్యాత క్రిస్ రాక్ ఆస్కార్ నామినేషన్లలో ఈసారి ‘నో బ్లాక్ నామినీస్’ అనే వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ‘ఆస్కార్ సో వైట్’ అని నల్లజాతికి చెందిన పలువురు తారలు ఈ వేడుకలను బహిష్కరించారు. అందుకేనేమో ఓపెనింగ్ మోనోలాగ్లోనే, ‘‘ఈసారి అవార్డుల కార్యక్రమాన్ని ‘వైట్ పీపుల్ చాయిస్’ కార్యక్రమంగా విమర్శిస్తున్నారు. అలా అయితే నాకిక్కడ హోస్ట్‌గా వ్యవహరించే చాన్స్ వచ్చి ఉండేది కాదు కదా! 1950, 60ల్లో జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకల్లో కూడా బ్లాక్ నామినీస్ ఎవరూ లేరు.
కేవలం 88వ ఆస్కార్ల కార్యక్రమంలో జరగడం ఇది కొత్తన్నట్లు చాలామంది మాట్లాడటం విచిత్రం’’ అని క్రిస్ పేర్కొన్నారు. ఇదో అందమైన సాయంత్రం: లియోనార్డో డికాప్రియో (ఉత్తమ నటుడు) - 1991లో ‘క్రిట్టర్స్ త్రీ’ అనే చిత్రం ద్వారా లియొనార్డో డికాప్రియో వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత పలు పాత్రలు చేసినప్పటికీ 1997లో నటించిన ‘టైటానిక్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆయన్ను పాపులర్ చేసింది.
1993లో ‘వాట్స్ ఈటింగ్ గిల్బెర్ట్ గ్రేప్’ చిత్రానికిగానూ ఉత్తమ సహాయనటునిగా తొలిసారి ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు లియొనార్డొ. ఆ తర్వాత ‘ఏవియేటర్’, ‘బ్లడ్ డైమండ్’, వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ చిత్రాలకుగానూ నాలుగు సార్లు నామినేషన్ దక్కించుకున్నప్పటికీ అవార్డు మాత్రం వరించలేదు. ‘రెవనెంట్’ చిత్రానికి నామినేషన్ దక్కించుకుని, పాతికేళ్ల కెరీర్లో ఈసారి డికాప్రియో అవార్డు కూడా సాధించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన ఎప్పట్నుంచో పోరాడుతున్నారు. దాన్ని ప్రస్తావించడానికి ఇదే సరైన వేదికగా భావించారాయన.
‘‘ప్రకృతికి, మనిషికీ ఉండే అనుబంధమే ‘రెవనెంట్’. రాను రాను వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మనిషినే కాక, మిగతా జీవుల అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. దీనిపై మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు, వాళ్ల పిల్లల బంగారు భవిష్యత్తు గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. చివరిగా ఓ మాట... రాబోయే కాలంలో ఈ గ్రహానికి ప్రమాదంగా పరిణమించే వేటినీ మనం ఉపేక్షించకూడదు. ఆ విషయాన్ని నేను తేలికగా తీసుకోను. ఈ ఆస్కార్ తో నా బాధ్యత ఇంకా పెరిగింది. ఈ అందమైన సాయంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అని డికాప్రియో అన్నారు.
ఇప్పుడు రంగుని చూడటంలేదు: అలెజాండ్రో గొంజాలెజ్ ఇన్నారిటు (ఉత్తమ దర్శకుడు) - ‘బర్డ్‌మ్యాన్’ చిత్రానికిగాను గతేడాది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ దక్కించుకున్న మొదటి మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో. ఈసారి ‘రెవనెంట్’ చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు. అలెజాండ్రో మాట్లాడుతూ - ‘‘వరుస ఆస్కార్లను అస్సలు ఊహించలేదు. ఈ సినిమాలో హీరో పాత్ర తన కొడుకుతో ‘‘నీ మాట ఎవరూ ఇక్కడ వినరు. కేవలం రంగునే చూస్తారు’’ అనే డైలాగ్ ఉంటుంది. మన అదృష్టం కొద్దీ మన జనరేషన్‌కు అలాంటి కష్టాల్లేవు. ఒకవేళ మనకెంత జుత్తు పెరిగినా ఎవరూ పట్టించుకోరు (పొడుగ్గా పెరిగిన తన జుత్తును చూపిస్తూ). అలాగే మన రంగును కూడా. కేవలం టాలెంట్ కే క్రైటీరియా’’ అనడం వీక్షకులను నవ్వించింది.
ఇక్కడిదాకా వస్తాననుకోలేదు: బ్రీ లార్సెన్ (ఉత్తమ నటి) - బుల్లి తెర నటిగా అడుగుపెట్టిన బ్రీ లార్సెన్ ‘రూమ్’ చిత్రంతో తొలి ఆస్కార్ అందుకున్నారు. ‘‘నాకు ఫిల్మ్ మేకింగ్‌లో నచ్చేదేంటంటే ఓ సినిమా రూపొందడంలో చాలామంది కృషి ఉంటుంది. అలాగే ఈ సినిమా వెనక కూడా చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ చాలా థ్యాంక్స్. నేనిక్కడిదాకా వస్తాననుకోలేదు’’ అని చెప్పారు.
మార్కొనీ ఎట్టకేలకు సాధించారు: ఇప్పటికి అయిదు సార్లు ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్న పెద్ద వయస్కునిగా సంగీత దర్శకుడు 87 ఏళ్ల ఎన్నీ మార్కొని కల చివరికి నిజమైంది. క్వెంటిన్ టరొంటినో తెరకెక్కించిన ‘ద హేట్‌ఫుల్ ఎయిట్’ చిత్రానికిగానూ ‘ఒరిజినల్ స్కోర్’ విభాగంలో ఆయన నామినేషన్ దక్కించుకున్నారు. ఈసారి మాత్రం తాతగారిని బంగారు బొమ్మ వరించింది. ఆస్కార్ అందుకున్న 87 ఏళ్ల వ్యక్తిగా అకాడమీ చరిత్రలో నిలిచిపోయారు.
ఆ సినిమాటోగ్రాఫర్ కు హ్యాట్రిక్
1995లో ‘ఎ లిటిల్ ప్రిన్సెస్’తో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగంలో తొలిసారిగా ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న స్పానిష్ సినిమాటోగ్రాఫర్ ఎమాన్యుల్ లుబెజ్కి. ఆ తర్వాత నాలుగు నామినేషన్లు దక్కించుకున్నా ఆస్కార్ వరించలేదు. చివరికి 2013 ఆస్కార్లలో ‘గ్రావిటీ’ చిత్రానికిగానూ ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా తొలి ఆస్కార్‌ను సొంతం చేసుకున్నారు. 2014లో ‘బర్డ్‌మ్యాన్’ చిత్రానికో ఆస్కార్, ఇప్పుడు 2015కి సంబంధించిన అవార్డుల్లో ‘ద రెవనెంట్’ చిత్రానికి ఆస్కార్ అందుకున్నారు. వరుసగా మూడు ఆస్కార్లతో హ్యాట్రిక్ సాధించారు.
- డి.జి. భవాని, బి. శశాంక్
విజేతల వివరాలు :-
చిత్రం: స్పాట్లైట్, నటుడు: లియోనార్డో డికాప్రియో (‘ద రెవనెంట్’), నటి: బ్రీ లార్సెన్ (‘రూమ్’), ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గొంజాలెజ్ (‘ద రెవనెంట్’), సహాయనటుడు: మార్క్ రెలైన్స్ (బ్రిడ్జ్ ఆఫ్ ద స్పైస్), సహాయనటి: అలీషియా వికందర్ (ద డనిష్ గాళ్), ఛాయాగ్రహణం: ఎమ్మాన్యుల్ లుబెజ్కి (‘ద రెవనెంట్’), ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: టామ్ మెకార్తి, జోష్ సింగర్ (‘స్పాట్లైట్’), ఎడాప్టడ్ స్క్రీన్‌ప్లే: ఆడమ్ మెక్కే, చార్లస్ రాండోల్ఫ్ (‘ద బిగ్ షార్ట్’), ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరెట్ సిక్సల్ (‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’), సౌండ్ ఎడిటింగ్: మార్క్ మ్యాంజిని, డేవిడ్ వైట్ (‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’), సౌండ్ మిక్సింగ్: క్రిస్ జెంకిన్స్, గ్రెగ్ రుడ్లొఫ్, బెన్ ఓస్మొ (‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’), కాస్ట్యూమ్ డిజైనర్: జెన్నీ బేవ్యాన్ (‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’), ప్రొడక్షన్ డిజైన్: కొలిన్ గిబ్సన్, లిసా థాంప్సన్ (‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’), మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్: లెస్లీ వ్యాండర్వాల్ట్, ఎల్కావార్డేగా, డమియన్ మార్టిన్ (‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’), విజువల్ ఎఫెక్ట్స్: ‘ఎక్స్ మెషినా’, యానిమేటడ్ షార్ట్ఫిలిమ్: బేర్ స్టోరీ, యానిమేటడ్ ఫీచర్ ఫిలిమ్: ఇన్సైడ్ ఔట్, డాక్యుమెంటరీ ఫీచర్: అమీ, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ఎ గాళ్ ఇన్ ద రివర్: ద ప్రిన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, విదేశీ చిత్రం: సన్ ఆఫ్ సొ (దేశం: హంగేరి), ఒరిజినల్ సాంగ్: రైటింగ్స్ ఆన్ ద వాల్ (‘స్పెక్టర్’), ఒరిజినల్ స్కోర్: ఎన్నీ మార్కోని (‘ద హేట్‌ఫుల్ ఎయిట్’)
ఉత్తమ నటుడుగా ఆస్కార్ అందుకున్న లియొనార్డో డిక్రాపియోకి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమకు చెందినవాళ్లల్లో డికాప్రియోను ఇష్టపడే తారలు ఉన్నారు. ఈ ‘టైటానిక్’ ఫేంకు అవార్డు దక్కిన సందర్భంగా ఇక్కడి సినీ తారలు ఏమన్నారో తెలుసుకుందాం...
‘‘రెండేళ్లుగా ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నా.
చివరికి లియొనార్డొ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నాడు.
పూర్తి అర్హత ఉన్న నటుడికే దక్కింది. చాలా ఆనందంగా ఉంది’’ - అల్లు అర్జున్
‘‘కంగ్రాచ్యులేషన్స్ చాంపియన్.. నువ్వు సింహానివి.
నీ అర్హతకు తగ్గదే లభించింది. నువ్వు చాలా సాధించావ్.
భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాధిస్తావ్’’ - అఖిల్
‘‘అవార్డు దక్కించుకున్నా దక్కించుకోకపోయినా లియొనార్డొ ఎప్పటికీ నా ఫేవరెట్ నటుడే.
అందుకే తనకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది.
గతంలో నామినేషన్లు పొందినప్పుడు కూడా తనే గెలవాలని కోరుకున్నాను’’ - త్రిష
‘‘హమ్మయ్యా! ఎట్టకేలకు లియోనార్డొ ఆస్కార్ దక్కించుకున్నాడు.
అయితే ‘రెవనెంట్’ చిత్రం ఒక్కదానికే కాదు.
మొత్తం అతను నటించిన అన్ని చిత్రాలకూ ఆస్కార్ వస్తే బాగుండేది.
గత ఏడాది ఆయన హీరోగా నటించిన ‘వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’కి ఆస్కార్ వచ్చి ఉండాల్సింది’’ - చార్మి
35 ఏళ్ల తర్వాత హంగేరీకి ఆస్కార్
ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో హంగేరి, ఫ్రాన్స్, డెన్మార్క్, కొలంబియా, జోర్డాన్ దేశాలకు సంబంధించిన చిత్రాలు నిలిచాయి. హంగేరీ దేశానికి చెందిన ‘సన్ ఆఫ్ సౌల్’ ఆస్కార్ గెల్చుకుంది. ఈ చిత్రదర్శకుడు లాష్లో నెమెస్కి ఇది తొలి చిత్రం కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. 35ఏళ్ల తర్వాత హంగేరీ దేశాన్ని వరించిన ఆస్కార్ ఇది. అంతకుముందు ‘మెఫిస్టో’ (1981) అనే చిత్రానికి ఆస్కార్ దక్కింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు.