జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?
కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'ఆట్టం' (మలయాళం) నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అవార్డ్ వచ్చేంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉందోనని తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.'ఆట్టం' విషయానికొస్తే.. కేరళలో ఓ నాటక బృందం. పనిచేసుకుంటూ వీలు దొరికినప్పుడు నాటకాలు ప్రదర్శించే 12 మంది. వీళ్లకి తోడు అంజలి (జరీన్ షిబాబ్) అనే అమ్మాయి. ఓసారి వీళ్ల ప్రదర్శన ఓ విదేశీ జంటకి తెగ నచ్చేస్తుంది. దీంతో తమ రిసార్ట్‌లో వీళ్లకు ఆతిథ్యమిస్తుంది. రాత్రంతా ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. తన గదిలో కిటికీ పక్కన పడుకున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అంజలితో అలా ప్రవర్తించింది ఎవరు? దీన్ని ఎలా బయటపెట్టింది అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?)మనుషులు పైకి కనిపించేంత మంచోళ్లు కాదు. ప్రతిఒక్కరిలోనూ రెండు ఫేస్‌లు ఉంటాయి. పైకి మంచిగా కనిపిస్తుంటారు కానీ కొన్నిసార్లు అవసరానికి తగ్గట్లే ప్లేట్ ఫిరాయించేస్తుంటారు. మంచోడిని అనిపించుకోవడం కోసం పక్కనోడిని తక్కువ చేసేలా మాట్లాడటానికైనా అస్సలు మోహమాటపడరు. ఇలా మనకు బాగానే తెలిసిన కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ఆట్టం'.ఇందులో హీరోయిన్‌తో ఎవరు అసభ్యంగా ప్రవర్తించారో చెప్పే క్రమంలో మనిషి నైజం, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు దర్శకుడు స్టోరీ చెప్పిన విధానం.. వ్యక్తి మనకు నచ్చకపోతే అతడేం చేసినా మనకు నచ్చదని చూపించిన వైనం అలరిస్తుంది. అలానే అందరూ ఎవరికీ వాళ్లు ఆలోచిస్తారు కానీ బాధింపబడ్డ అమ్మాయి మానసిక పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోకపోవడం లాంటి సీన్లు మనిషి ఇప్పుడున్న కాలంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పకనే చెబుతాయి. (ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)