బీర్లు తాగడం వల్ల వచ్చే పొట్ట... ‘బీర్ బెల్లీ’!
మెడిక్షనరీ
తరచూ బీర్ తాగే వారికి పొట్ట పెరుగుతుంది. దీన్నే వాడుక భాషలో బీర్ బెల్లీ అంటుంటారు. అయితే బీర్ తాగడంతో పాటు అత్యధికంగా క్యాలరీలు తీసుకోవడం వల్ల కూడా ఇది వస్తుంది. కుండలా పెరగడం వల్ల ఇలా పెరిగే పొట్టను పాట్ బెల్లీ అని కూడా అంటుంటారు. వైద్య పరిభాషలో దీన్ని అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ అని కూడా చెబుతారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, మితిమీరి తినడం, ఒంటికి తగినంత పనిచెప్పకపోవడం... ఇలా కారణం ఏదైనా బీర్ బెల్లీ మాత్రం ప్రమాదకరమే. గుండెజబ్బులు, హైబీపీ, డయాబెటిస్... ఇలా ఎన్నో వ్యాధులకు బీర్బెల్లీ ఒక రిస్క్ ఫ్యాక్టర్. పొట్టదగ్గర చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే ప్రమాదం కలిగించే పొట్ట ఉన్నట్లుగా భావించి తగిన జీవనశైలి మార్పులు చేసుకోవాలి.