దావూద్ అనుచరుడు అబ్దుల్ కరీం టుండా అరెస్టు
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, భారత్ ఎంతో కాలంగా తీవ్రంగా గాలిస్తున్న ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా ఎట్టకేలకు దొరికాడు. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలో పలు చోట్ల జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడైన ఇతడిని.. శుక్రవారం మధ్యాహ్నం భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు పాకిస్థాన్ పాస్పోర్టుతో భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబై మారణహోమ సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన టుండా.. బాంబుల తయారీలో దిట్ట. చాలాకాలంపాటు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు బాంబులు తయారు చేసిపెట్టాడు కూడా! దాదాపు 19 ఏళ్లుగా భారత్ సహా పలు దేశాలు ఇతడి కోసం వెతుకుతున్నాయి. సరిహద్దు వద్ద బన్వాసా-మెహేందర్నగర్ ప్రాంతంలో దొరికిన టుండాను పోలీసులు ఢిల్లీ తరలించారు. జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ, హఫీజ్ సయీద్, వాధావా సింగ్, రత్నదీప్ సింగ్, అబ్దుల్ అజీజ్ అలియాస్ బడా సాజిద్ లాంటి ఉగ్రవాద అగ్రనేతలతో ఇతడు కలిసి పనిచేశాడని పోలీసులు చెబుతున్నారు.
మోస్ట్ వాంటెడ్..
ముంబైలో ఉగ్రవాదుల మారణహోమం తర్వాత 20 మంది ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత్ పాకిస్థాన్‌కు పంపిన జాబితాలో టుండా కూడా ఉన్నాడు. లష్కరే తోయిబా చీఫ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, దావూద్‌ల పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్(స్పెషల్ సెల్) ఎస్.ఎన్.శ్రీవాత్సవ శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అతడిని అరెస్టు చేసిన విషయం వెల్లడించారు. టుండా దొరికినప్పుడు పాకిస్థాన్‌లో ఈ ఏడాది జనవరి 23న జారీచేసిన ‘ఏసీ441361’ నంబరు పాస్‌పోర్టును కలిగి ఉన్నాడని, దానిపై ఇతడి పేరు అబ్దుల్ ఖుద్దూస్గా పేర్కొన్నారని చెప్పారు. స్థానిక మార్కెట్లలో దొరికే యూరియా, నైట్రిక్ యాసిడ్, పొటాషియం, క్లోరైడ్, నైట్రోబెంజీన్, చక్కెరలతో బాంబులు తయారుచేయడంలో యువ ఉగ్రవాదులకు టుండా శిక్షణ ఇచ్చేవాడని అన్నారు. అతడిని శనివారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని, మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారని తెలిపారు. టుండాను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఎలా దొరికాడు?
టుండా ఎలా పట్టుబడ్డాడన్న దానిపై భిన్న కథనాలు వినవస్తున్నాయి. ఇతడిని గల్ఫ్‌లో పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారని కొందరు పోలీసులు చెబుతున్నారు. టుండా పది రోజుల కిందటే కరాచీ నుంచి విదేశాలకు వెళ్లాడని, తర్వాత దుబాయ్ మీదుగా కఠ్మాండు వచ్చాడని, దుబాయ్‌లో ఇతడి జాడ కనిపెట్టి నిఘావర్గాలు అందించిన సమాచారంతో భారత్-నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారని మరికొందరు పోలీసులు చెప్తున్నారు.
భారత్‌లో 43 బాంబు పేలుళ్లు..
టుండా లష్కరే తోయిబాకు బాంబులు తయారు చేసిపెట్టే నిపుణుల్లో ఒకడు. దేశంలో జరిగిన 43 బాంబు దాడుల్లో ఇతడి ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే 21 కేసుల్లో అతడి కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు. 1993లో 250 మందిని బలితీసుకున్న ముంబై వరుస పేలుళ్లలో ఇతడిది ప్రధాన పాత్ర. 1997-98 మధ్య ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలోను, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన వరుస పేలుళ్లతోపాటు పానిపట్, సోనెపట్, లూథియానా, హైదరాబాద్, రోహ్తక్, జలంధర్లలో జరిగిన పేలుళ్లలోనూ ఇతడి హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇతడి వద్ద శిక్షణ పొందిన వారు భారత్‌లో పాల్పడిన మొత్తం 43 బాంబు పేలుళ్లలో 20 మందికిపైగా మరణించగా.. 400 మందికిపైగా గాయపడ్డారు. 2010 కామన్వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీలో పేలుళ్లు సృష్టించడానికి టుండా ప్లాన్ చేశాడు. అతడి అనుచరులను పోలీసులు పట్టుకోవడంతో పేలుళ్లను నివారించగలిగారు. 1993 డిసెంబర్ 5, 6లలో హైదరాబాద్, గుల్బర్గా, సూరత్, లక్నోల్లోని రైళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కేసుల్లో కూడా టుండా నిందితుడు. ఇతడిపై 1996లోనే ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసింది.
2000లో మరణించాడు?
టుండా ఆచూకీ, అతడి ఉగ్రవాద కార్యకలాపాల గురించి పూర్తి వివరాలు పోలీసులకు తెలిసింది 1998లో. టుండా వద్ద శిక్షణ పొందిన ఇద్దరు బంగ్లాదేశీ విద్యార్థులు ఢిల్లీలో పోలీసులకు చిక్కడంతో ఇతడి పూర్తి వివరాలు బయటపడ్డాయి. తర్వాత కొన్ని రోజులకు అతడి మాడ్యూల్లో ఉన్న 24 మందిని కూడా అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసులు వెతుకుతుండగా.. 2000లో బంగ్లాదేశ్‌లో జరిగిన పేలుళ్లలో అతడు మరణించినట్లు వార్తలొచ్చాయి. దీంతో పోలీసులు వెతుకులాట ఆపేశారు. అయితే కొన్నాళ్ల తర్వాత మరో ఉగ్రవాది దొరికినప్పుడు టుండా బతికే ఉన్నాడని తేలడంతో మళ్లీ వెతకడం మొదలు పెట్టి ఇన్నాళ్లకు పట్టుకున్నారు.
కార్పెంటర్ నుంచి ఉగ్రవాదిగా..
టుండా ఉగ్రవాది కావడానికి ముందు ఒక సాధారణ కార్పెంటర్. 1943లో ఢిల్లీ దార్యాగంజ్లోని చట్టా లాల్ మియా ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో జన్మించాడు. పుట్టిన కొన్ని రోజులకే వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని తమ స్వస్థలం పిల్ఖువాకు వెళ్లిపోయింది. అక్కడ రాగి, తగరం, అల్యూమినియం లాంటి లోహాలను మలిచి, కరిగించే పనిచేసే తండ్రికి మొదట్లో ఇతడు సహాయంగా ఉండేవాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబ పోషణ భారం ఇతడిపైనే పడింది.
ఆ నేపథ్యంలో కొంతకాలం కార్పెంటర్‌గా, స్క్రాప్ డీలర్‌గా, వస్త్ర వ్యాపారిగా కూడా పనిచేశాడు. అయితే 1980లలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులతో పరిచయమయ్యాక అతడు ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దిగాడని పోలీసులు చెబుతున్నారు. తర్వాత బంగ్లాదేశ్ వెళ్లి జీహాదీలకు బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చేవాడు. ఆపై పాకిస్థాన్ వెళ్లి బాంబుల తయారీ, ఉగ్రవాద శిక్షణల్లో నిమగ్నమయ్యాడని అంటున్నారు. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్లతో అతడి పేరు పోలీసుల దృష్టి వచ్చిం ది. వాస్తవానికి టుండా అసలు పేరు అబ్దుల్ కరీం మాత్రమే. అయితే 1985లో ముంబైలో బాంబు తయారు చేస్తుండగా అది పేలి అతడి ఎడమ చేయి తెగిపోయింది. అప్పటి నుంచి అతడికి టుండా(చేతులు కోల్పోయినవాడు) అని పేరు స్థిరపడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో అతడి రక్త సంబంధీకుల్లో తమ్ముడు అబ్దుల్ మాలిక్(కార్పెంటర్) ఒక్కడే బతికి ఉన్నాడని సమాచారం. టుండా ఇప్పటిదాకా మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి 65 ఏళ్ల వయసులో 18 ఏళ్ల యువతితో జరిగింది.