ఏసీబీ వలలో రెవెన్యూ చేపలు
కొవ్వూరు: కొవ్వూరులో ఒక రైతు నుంచి రూ.3 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు, ఒక రిటైర్డ్ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కొవ్వూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్-1గా పనిచేస్తున్న కె.నల్లరాజు, వీఆర్వో ఎన్.దుర్గారావు, రిటైర్డ్ వీఆర్వో మహ్మద్ అబ్దుల్ షరీఫ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ఐ.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేములూరు గ్రామానికి చెందిన సున్నం వీరవెంకట సుబ్రహ్మణ్యాచార్యులు అనే రైతుకు 60 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది.
అందులోని పాతబోరు పైపులు తుప్పు పట్టడంతో నీరు సక్రమంగా రావడం లేదు. దీంతో ఈనెల 2న సుబ్రహ్మణ్యాచార్యులు బోరుకు ఉన్న ఇనుప పైపులను తొలగించి ప్లాస్టిక్ పైపులను వేసే పని ప్రారంభించారు. ఈనెల 4న ఆర్ఐ నల్లరాజు రిటైర్డ్ వీఆర్వో అబ్దుల్ షరీఫ్‌తో కలిసి వెళ్లి అనుమతి లేకుండా బోరు ఎలా వేస్తున్నావని రైతును ప్రశ్నించారు. ఆఫీసుకు వచ్చి కలవాలని సూచించారు. ఆ రైతు తహసిల్దార్ కార్యాలయూనికి వెళ్లగా, రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా బోరు వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, బోరు పూర్తయిన తరువాత కలుస్తానని చెప్పిన సుబ్రహ్మణ్యాచార్యులు వారిని కలవలేదు. దీంతో వీఆర్వో ఎన్.దుర్గారావు రైతు ఇంటికి వెళ్లి వాల్టా చట్టానికి విరుద్ధంగా బోరు వేశారని, సుబ్రహ్మణ్యాచార్యులును జైలుకు పంపుతామంటూ అతని భార్యను బెదిరిం చారు. దీంతో ఈనెల 22, 23 తేదీల్లో ఆ రైతు తహసిల్దార్ కార్యాలయూనికి వెళ్లి అంత సొమ్ము ఇచ్చుకోలేనని ఆర్ఐని బతిమాలారు.
మొదట రూ.3 వేలు ఇస్తానని చెప్పి వచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి సుబ్రహ్మణ్యాచార్యులుకు రూ.3 వేలు ఇచ్చి తహసిల్దార్ కార్యాలయూనికి పంపించారు. అతడు ఆ మొత్తం లంచం ఇవ్వగా, అందులో రూ.2 వేలను ఆర్ఐ నల్లరాజు తీసుకున్నారని, వీఆర్వో దుర్గారావుకు రూ.వెయ్యి ఇచ్చారని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులైన ఆర్ఐ నల్లరాజు, వీఆర్వో దుర్గారావు, రిటైర్డ్ వీఆర్వో మహ్మద్ అబ్దుల్ షరీఫ్‌ను అరెస్ట్ చేశామని వివరించారు. వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ యూజే విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.