Crime News: నగ్నంగా మృతదేహాలు, వివాహేతర సంబంధమే కారణమా?
అబ్దుల్లాపూర్‌మెట్ : హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం ఉంది. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి వచ్చిన వీరు హత్యకు గురై ఉంటారని భావించిన పోలీసులు క్లూస్‌టీంతో పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాలు నగ్నంగా ఉండటం, యశ్వంత్ తలపై బలమైన గాయాలు ఉన్నాయి. జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు.
సంఘటన స్థలంలో చార్జింగ్‌లైట్లు..
సంఘటన స్థలంలో బ్యాగు, చార్జింగ్ లైట్లు, ప్లాస్టిక్‌పూలు, మొబైల్ చార్జర్‌తో పాటు కూల్‌డ్రింక్ సీసాలు లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైక్ పార్కింగ్ చేసి ఉంది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ వాసంస్వామి పరిశీలించారు.
వివాహేతర సంబంధమే కారణమా?
హత్యకు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యశ్వంత్, జ్యోతి ఏకాంతంగా ఉన్న సమయంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన వారే వీరిని వెంబడిస్తూ వచ్చి హత్య చేశారా? అనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నారు. జ్యోతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మిస్సింగ్ కేసు నమోదు కాలేదు
అబ్ధుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో దారుణహత్యకు గురైన ఎడ్ల యశ్వంత్ సంబంధించి ఎటువంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. వారాసిగూడలోని మృతుడి తల్లితండ్రులు ఎడ్ల సురేష్, మంజుల మీడియాతో మాట్లాడుతూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే యశ్వంత్ ఆదివారం ఇంటినుంచి బయటికి వెళ్లినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసులు సమాచారం అందించడంతో యశ్వంత్ సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలిపారు.
ఆదివారం ఇంటి నుంచి వచ్చాడు
ఈనెల 1 న సాయంత్రం నా బైక్ తీసుకుని మా అన్న యశ్వంత్ బయటికి వచ్చాడు. ఒక్కోసారి రెండు మూడు రోజుల వరకూ ఇంటికి రాడు. అలాగే ఎక్కడికైనా వెళ్లాడనుకున్నాం. పోలీసుల ద్వారా సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చాం. మా అన్నకు ఎవరితో విభేదాలు లేవు. హత్యకు గురైన మహిళతో పరిచయం ఉన్న విషయం తెలియదు.
– మృతుడి సోదరుడు అనిరుద్