ఒబామా దిగిపోతున్నారని తెలియగానే..
న్యూయార్క్: అమెరికాలోనైనా సరే, ఆఫ్రికాలోనైనా సరే నాలుగేళ్ల పిల్లలకు దేశాధ్యక్షుడెవరో సాధారణంగా తెలియదు. కానీ అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలోని బీవర్టన్ నగరానికి చెందిన నాలుగేళ్ల పాప అబెల్లా టామ్లిన్కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అని తెలియడమే కాకుండా ఆయనకు వీరాభిమాని కూడా. బరాక్ ఒబామా త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్నారని కారులో కూర్చున్న చిట్టి తల్లి అబెల్లాకు తల్లి ఆండ్రియా చెప్పగానే వెక్కి వెక్కి ఏడ్చేసింది.
డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఒబామా ప్రసంగాన్ని వింటున్న ఆండ్రియా, ఒబామా దిగిపోతున్న విషయాన్ని తన కూతురుకు చెప్పగానే ఆ పాప ఏడపందుకుంది. వెక్కివెక్కి ఏడ్చింది. ఒబామా స్థానంలో హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్షులుగా ఎన్నికవుతారంటూ తల్లి సముదాయించేందుకు ప్రయత్నించినా ఆ పాప తన ఏడుపాపలేదు. ఒబామా ఉన్నాక మరో అధ్యక్షుడు మనకెందుకు అంటూ అమాయకంగా తల్లిని ప్రశ్నించింది. చిన్నప్పటి నుంచి ఒబామా అంటే తన పాపకు ఎంతో ఇష్టమని మామ్ చెప్పారు.
‘ఒబామా అధ్యక్షుడిగా కొనసాగితే మాత్రం మనతో కలసి భోంచేస్తారా, చెప్పు!’ అంటూ తల్లి బుజ్జగించేందుకు ప్రయత్నించినా, అసలు ఎందుకు తప్పుకోవాలంటూ ఆ పాప ఎదురు ప్రశ్నించింది. ఒబామా తర్వాత హిల్లరీ ఎన్నికవుతారని, ఆమె కూడా చాలా మంచిదేనని నచ్చచెప్పానని, ఉద్దేశపూర్వకంగానే హిల్లరీతో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పలేదని ఆండ్రియా వివరించారు. ప్రతికూల దృక్పథంతో మాట్లాడేవారి గురించి తన పాపకు చెప్పడం తకను ఇష్టం లేదని ఆమె అన్నారు.
పాప వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలను ఆండ్రియా వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడావీడియో హల్చల్ చేస్తోంది. అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాక వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ఒబామా తన పదవికి రాజీనామా చేస్తున్న విషయం తెల్సిందే.