హత్యకేసు నిందితులపై గూండా చట్టం ప్రయోగం
హొసూరు : విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సూరి (సురేష్) దారుణ హత్య కేసులో ముగ్గురు నిందితులను క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి న్యాయస్థానంలో లొంగిపోయారు. విశ్వహిందూ పరిషత్ నేత సూరిని గత నెల 21వ తేదీ రాత్రి హొసూరు సమీపంలో నెహ్రూనగర్‌లో వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసులో నిందితుల కోసం ప్రత్యేక పోలీసు దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. అదే నెల 24వ తేదీ ఉదయం మత్తిగిరికి చెందిన బాబు, హొసూరుకు చెందిన సాజిత్ బాషా, హొసూరు శాంతినగర్‌కు చెందిన గజేంద్రలు కోర్టులో లొంగిపోయారు.
గట్టి పోలీసు బందోబస్తు మధ్య ముగ్గురు నిందితులను సేలం జైలుకు తరలించారు. జైలులో ఉంటున్న వీరిపై గూండా చట్టం ప్రయోగించాలని జిల్లా ఎస్పీ మహేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్ సి. కదిరవన్‌కు సిఫార్సు చేశారు. పరిశీలించిన కలెక్టర్ గూండా కేసుకు ఉత్తర్వలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం వీరిపై గూండా కేసు నమోదు చేశారు.