మాస్టర్ వర్సెస్ బ్లాస్టర్
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఎన్నో రికార్డులను తన పేరిటి లిఖించుకుని 'మాస్టర్' ఆటకు వీడ్కోలు పలికాడు. సచిన్ రికార్డులను అధిగమించే సత్తా ఉన్న ఆటగాడు ఎవరనే ప్రశ్నకు సమాధానంగా మొట్టమొదట వినిపించే పేరు విరాట్ కోహ్లి. అంచనాలకు తగ్గట్టే వేగంగా పరుగులు సాధిస్తూ కోహ్లి దూసుకుపోతున్నాడు.
స్వభావరీత్యా సచిన్ తో ఏమాత్రం పోలిక లేకపోయినా ఆటతీరులో మాత్రం 'మాస్టర్'ను గుర్తు చేస్తున్నాడీ యువ బ్యాట్స్ మన్. నిలకడైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తూ శిఖరస్థాయిని అందుకునేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. సచిన్ రికార్డులను అధిగమించగల సత్తా తనకే ఉందని తన ఆటతో క్రీడా ప్రపంచానికి చాటాడు. దీంతో బ్యాటింగ్ గణంకాల పరంగా వీరిద్దరినీ పోల్చిచూస్తున్నారు. సమాన సంఖ్యలో మ్యాచ్ లు ఆడినప్పుడు వీరిద్దరూ ఎన్ని పరుగులు చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు 171 వన్డేలు, 41 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లి ఆడిన పరుగుల పరంగా సచిన్ కంటే ముందున్నాడు.
ఎవరెలా ఆడారంటే...
* 171 వన్డేల్లో కోహ్లి 163 ఇన్నింగ్స్ ఆడి 51.51 సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. నాటౌట్ గా 23సార్లు నిలిచాడు.
* సచిన్ తన మొదటి 171 వన్డేల్లో 166 ఇన్నింగ్స్ ఆడి 38.85 సగటుతో 5828 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలు, 36 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 137. నాటౌట్ గా 16సార్లు నిలిచాడు. (సచిన్ మొదటి 70 వన్డేల్లో 5 లేదా 6 స్థానాల్లో ఎక్కువగా బ్యాటింగ్ కు దిగాడు)
* 41 టెస్టుల్లో 72 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 44.02 సగటుతో 2994 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 169. నాలుగు సార్లు నాటౌట్ గా నిలిచాడు.
* సచిన్ తన తొలి 41 టెస్టుల్లో 60 ఇన్నింగ్స్ ఆడి 54.92 సగటుతో 2911 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 179. ఏడు సార్లు నాటౌట్ గా ఉన్నాడు.