ఏడీఏల సస్పెన్షన్‌కు కలెక్టర్ సిఫారసు?
అనంతపురం అగ్రికల్చర్ : రైతులకు దక్కాల్సిన క్రిబ్కో కంపెనీకి చెందిన రాయితీ ఎరువులను నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు తరలించిన వ్యవహారంలో ఏడీఏ (పీపీ) కె.మల్లికార్జున, అనంతపురం డివిజన్ ఏడీఏ రవికుమార్‌లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ శశిధర్ వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు సిఫారసు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అక్రమ బాగోతంపై జాయింట్ కలెక్టర్–2 ఖాజామొహిద్దీన్ విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేసిన విషయం విదితమే.
దీని ఆధారంగా ఏడీఏ (పీపీ) కె.మల్లికార్జున, ఏడీఏ రవికుమార్‌లను ఇప్పటికే విధుల నుంచి తప్పించారు. తదుపరి చర్యల్లో భాగంగా ఇద్దరినీ సస్పెండ్ చేయాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిపాత్ర ఏ స్థాయిలో ఉందనే విషయంపై విచారణ కొనసాగించి.. మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో ఇద్దరు అధికారులకూ సస్పెన్షన్ ఉత్తర్వులు రావచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద ఎరువుల కుంభకోణం వ్యవసాయశాఖలో కలకలం రేపుతోంది. ఇందులో భాగస్వాములైన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.