సరస్వతీపుత్రుడు ఈ రైతు బిడ్డ
మునగపాక యువకుడికి డాక్టరేట్
మల్టీనేషనల్ కంపెనీలో ప్రిన్సిపల్ ఇంజినీర్ ఉద్యోగం
పేదరికంలో పుట్టినా పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలో అయినా రాణించ గలమని నిరూపించాడు మునగపాక గ్రామానికి చెందిన ఆడారి రామభద్రరావు. వ్యవసాయం చేసుకుంటూ చదివించుకున్న కొడుకు ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునగపాకకు చెందిన ఈ యువకుడు ముంబాయి ఐఐటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు.
మునగపాక: మైక్రో చిప్ డిజైనింగ్‌లో కాంపౌండ్ సెమీ కండక్టర్స్ ఫర్ అడ్వాన్స్డ్ నానో ఎలక్ట్రానిక్స్‌లో చేసిన పరిశోధనకు గాను నాలుగు రోజుల క్రితం ముంబాయిలో పిహెచ్డి ప్రదానం చేశారు. దీనివలన తక్కువ పరిమాణం గల చిప్‌లో స్టోరేజి సామర్ధ్యం పెరుగుతుంది. డాక్టరేట్ పొందిన రామభద్రరావు మునగపాకలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆడారి జగ్గారావు కుమారుడు రామభద్రరావు పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోను, ఇంటర్ అనకాపల్లి ఎఎంఎఎల్ కళాశాలలోను, బీఎస్సీ విశాఖ ఎవిఎన్ కళాశాలలో చదువుకున్నాడు.
ఆసెట్లో 26వ ర్యాంక్ సాధించి ఎమ్మెస్సీ చేశాడు. గేట్లో 27వ ర్యాంక్‌తోపాటు శాస్త్రవేత్త ప్రవేశపరీక్షలో బిఎఆర్‌సి, డిఆర్‌డిఒ సంస్థల్లో ఉత్తీర్ణత సాధించి, సైంటిస్టుగా ఎదిగాడు. వివిధ అంశాలపై రామభద్రరావు చేసిన పది పరిశోధనలు అంతర్జాతీయంగా ప్రచురితం కాగా 12 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. రామభద్ర రావు చేసిన పరిశోధనల్లో ఒకటి పేటెంట్ హక్కు కూడా పొందడం విశేషం.
ఐబిఎం వంటి పలు సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న రామభద్రరావు ప్రపంచ మొదటి శ్రేణి ఎలక్ట్రానిక్స్ కంపెనీ టీఎస్ఎంసి చైనాలోని తైవాన్ బ్రాంచిలో చేరి రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రిన్సిపల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మెరుగైన ప్రభుత్వ మౌలిక సదుపాయాలతోపాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సహకారం, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత విద్యను సాధించవచ్చని రామభద్రరావు నిరూపించాడు.