మంత్రికి సెల్యూట్ చేయాలని ప్రోటోకాల్‌లో లేదు!
తిరువనంతపురం: కేరళ హోంమంత్రి రమేష్ చెన్నీతాలాకు సెల్యూట్ చేయకపోవడంతో అడిషనల్ డీజీపీ రిషిరాజ్ సింగ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. వివరాలు..శనివారం కేరళ రాష్ట్ర పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వచ్చే సమయంలో రిషిరాజ్ సింగ్ సెల్యూట్ చేయకుండా కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని మరుసటి రోజు (ఆదివారం) ప్రముఖ దినపత్రికలలో ముద్రించారు.ఈ వ్యవహారం పై వివరణ కోరగా మంత్రివచ్చినప్పుడు నిలబడి సెల్యుట్ చేయాలన్న నిబంధన ప్రోటోకాల్‌లో లేదని ఆ అధికారి చెప్పిన సమాధానం ప్రభుత్వానికి మరింత చిరాకు తెప్పించినట్టయింది.
అయితే నెటిజన్స్, ప్రతిపక్షాలు మాత్రం ఆ సీనియర్ పోలీస్ అధికారికి బాసటగా నిలిచాయి. అయితే వెనుక నుంచి వస్తున్న మంత్రిని వేదిక ముందు వైపు కూర్చున్న తను ఎలా చూడగలనని సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచారు. తనకు ఇచ్చిన ఆహ్వాన లేఖలో జాతీయ గీతం వచ్చే సమయంలో మాత్రమే నిలబడాలని ఉంది అని అయన అన్నారు. ఈ సంఘటన పై ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు.
ఇదిలా ఉండగా సింగ్‌కి పోలీస్ శాఖలో ఒక మంచిపేరుంది. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌గా ఉన్నపుడు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలుపరిచారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేసినపుడు అవినీతిని అరికట్టారు. వారం రోజుల కిందే అడిషనల్ డీజీపీ(బెటాలియన్)గా బదిలీ అయ్యారు. సింగ్‌ను తరచూ ట్రాన్స్ఫర్ చేయడంపై ప్రతిపక్షాలు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. బ్రిటీష్ కాలం నాటి వీవీఐపీ సంస్కృతిని ప్రభుత్వం ఇంకా అనుసరిస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 'మీకన్నా నేనే గొప్ప అని చెప్పుకొవడానికే బ్రిటీష్ వాళ్లు ఈ పద్దతి పాటించారని ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నాయని' విపక్షాలు విమర్శిస్తున్నాయి.