సినిమా రివ్యూ: రోమియో
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ రాసిన ప్రేమ కథ అంటూ భారీ బిల్డప్ కారణంతో చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీగానే 'రోమియో' ఆశలు అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సినీ ప్రేమికులకు రోమియో చాలా కాలంగానే దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు అక్టోబర్ 10(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోమియో ఎలాంటి ఫలితాన్ని చవిచూశాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
న్యూయార్క్ లో ఉండే సమంత(అడోనిక)కు ఒంటరిగా ట్రావెలింగ్ చేయడమంటే అంటే చాలా ఇష్టం. ఇంట్లోవాళ్లను ఒప్పించి యూరప్ పర్యటనకు వెళ్తుంది. యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీలోని రోమ్ చేరుకుంటుంది. రోమ్ నగరంలో సమంతను కిట్టు (సాయిరాం శంకర్) చూసి వెంటాడటం ప్రారంభిస్తాడు. ప్లాన్ ప్రకారం సమంతకు దగ్గరై పాస్ పోర్ట్ ను తన దగ్గరే పెట్టుకుని ఏడిపిస్తుంటాడు. కావాలనే తన పాస్ పోర్ట్ తన వద్ద పెట్టుకుని ఏడిపిస్తున్నాడని తెలుసుకున్న సమంత.. కిట్టూని నిలదీస్తుంది. దాంతో కిట్టు తన ఫ్యాష్ బ్యాక్ ను చెపుతాడు. అయితే కిట్టు ఫ్లాష్ బ్యాక్ కు, సమంతకు లింకేమిటి? ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించిన రవితేజ, ఆలీ, జయసుధ, నాగబాబులకు పాత్రల ఎంటీ? కిట్టు, సమంతల కథ చివరకు ఏమైందనేదే 'రోమియో' సినిమా.
ఆకట్టుకునే అంశాలు:
యూరప్, ముఖ్యంగా రోమ్ నగర అందాలు
పీజీ విందా ఫోటోగ్రఫి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నిరాశ పరిచే అంశాలు:
కనీస స్థాయిలో కూడా దర్శకుడి ప్రతిభ ఆకట్టుకోకపోవడం
తలా తోకాలేని కథ
పట్టులేని కథనం
నటీనటుల పనితీరు
విశ్లేషణ:
కిట్టూగా పూరి సోదరుడు సాయిరాం శంకర్, సమంతగా అడోనికలు నటించారు. కథలో దమ్ము లేకపోవడంతో, కథనం సాదాసీదాగా ఉండటం, తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎలాంటి ట్విస్టులు లేకపోవడం ప్రేక్షకుడ్ని ఓ స్థాయిలోనూ ఆకట్టుకోని విధంగా ఉంది. హీరో కారెక్టర్ ఎంటో, యూరప్ ఎందుకెళ్లాడో అనే చిన్న లాజిక్ ను కూడాదర్శకుడు పట్టించుకోలేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసే అంశాల్లో ఒకటి. కనీసం వైజాగ్ లో పద్దుతో హీరో ప్రేమ కథను ఫ్లాష్ బ్యాక్ లో చూపించగలిగి ఉండే కొంత సమంజసంగా ఉండేదేమో. ఇక మధ్య మధ్యలో రవితేజ, ఆలీ కనిపించడం కొంత ఊరటతోపాటు, కొంత హాస్యాన్ని పండించినా..సినిమాకు బలంగా మారుతుందని చెప్పడం కష్టమే. ఓ సినిమా కన్నా ట్రావెల్ గైడ్ గానే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే దర్శకుడు దృష్టి సారించారా అనిపిస్తుంది. సినిమా కంటే యూరప్ అందాలే ప్రేక్షకుడికి కొంత ఊరటనిచ్చాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాలంటే పీజి విందా ఫోటోగ్రఫి మాత్రమే. ఇక సునీల్ కాశ్యప్ సంగీతం కూడా అంతంతమాత్రేమే. పాటలు కూడా ఆలరించలేకపోయాయి. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారలేకపోయింది. పూరి రాసిన ప్రేమకథ ఇంత నాసిరకంగా ఉంటుందా? లేదా ఆయన చెప్పిన కథను తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారా అనే ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడటం చాలా కామన్ పాయింట్ గా మిగిలింది. పూరి మదిలో మెదిలిన 'రోమియో' ప్రేక్షకులను ఆకట్టుకోవడమనేదా అనే మిలియన్ డాలర్ ప్రశ్నే అని చెప్పవచ్చు.
-రాజబాబు అనుముల