ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాలపై రాళ్ల వర్షం
పుణె: ప్రసిద్ధ ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిపై వెళుతున్న వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్ల వాన కురిసింది. రహదారిలోని అదోషి టన్నెల్ వద్ద ఆదివారం మద్యాహ్నం కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా బండరాళ్లు కూలి ఓ కారు, మరో రెండు వాహనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మరణించినట్లు తెలిసింది. చిత్రంలో కినిపిస్తున్న కారుపై పెద్ద బండరాళ్లు నేరుగా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. రహదారిపై రాళ్లు గుట్టలా పేరుకుపోవడంతో ఇరువైపులా భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. యంత్రాలతో రాళ్లను తొలిగిస్తున్న పోలీసులు మరికొద్ది గంటల్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తామని చెప్పారు. ముంబై- పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఇలాంటివి ఐదారు టన్నెల్స్ ఉన్నాయి. దీంతో అధికారులు అన్నిచోట్ల ముందస్తు రక్షణచర్యలు చేపట్టారు.