అద్భుత ద్వీపం
► భవానీద్వీపానికి సింగపూర్ బృందం కితాబు
► ఏటా పెరుగుతున్న ఆదాయం
► అయినా.. అభివృద్ధి శూన్యం
► ఇప్పటికైనా స్పందించాలి మరి..
‘ఇటువంటి ద్వీపాన్ని మా వద్ద కృత్రిమంగా నిర్మించాం. ఇక్కడ సహజసిద్ధంగా ఉంది. కృష్ణానదిలో ఉన్న ఈ ద్వీపాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోంది.’ ..ఇవి ఎవరో సాధారణ వ్యక్తులు అన్న మాటలు కావు. కొత్త రాజధానిని ఏరియల్ సర్వే చేసేందుకు వచ్చిన సింగపూర్ బృందం బుధవారం మునిసిపల్ మంత్రి నారాయణ వద్ద చెప్పిన మాటలు.
అంతగా విదేశీయులను సైతం ఆకట్టుకున్న భవానీద్వీపం అభివృద్ధిలో మాత్రం అధఃపాతాళంలోనే ఉంది. ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా.. లక్షల్లో ఆదాయం వస్తున్నా.. ద్వీపంలో అదనపు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించే వారే కరువయ్యూరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాజధాని నిర్మాణంతో పాటు భవానీద్వీపాన్ని కూడా అభివృద్ధి చేయూలని పర్యాటకులు కోరుతున్నారు.
విజయవాడ : చుట్టూ పచ్చటి పచ్చికబయళ్లు.. కృష్ణమ్మ పరవళ్లు.. ప్రశాంతమైన వాతావరణంతో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన పర్యాటక ప్రాంతం భవానీద్వీపం. 133 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే, ఇందులో కేవలం 25 ఎకరాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఉపయోగించుకుంటోంది. నాలుగు ట్రీ రిస్టార్ట్స్, 14 డీలక్స్ కాటేజీలు, రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. చిన్నారుల కోసం సాహస క్రీడలు, రోప్గేమ్స్ అదనపు ఆకర్షణ. వీటికితోడు కృష్ణానదిలో విహారానికి బోధిసిరి, కృష్ణవేణి, అమర్పాలి, భవానీ బోట్లతో పాటు స్పీడ్, జట్‌స్కీ బోట్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటి వల్లే ఇటీవల ముగిసిన కార్తీకమాసంలో భవానీద్వీపం ద్వారా ఏపీటీడీసీకి సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.19 లక్షలు రాగా, ఈ ఏడాది మరో రూ.11 లక్షలు ఎక్కువ రావడం విశేషం.
అభివృద్ధి సంగతేంటి?
విదేశీయులను సైతం ఆకట్టుకున్న భవానీద్వీపం ఎంతమేరకు అభివృద్ధి చెందిందనేది పర్యాటకుల ప్రశ్న. సింగపూర్ బృందం, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే అద్భుత పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దవచ్చని వారు పేర్కొంటున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు ద్వీపం అభివృద్ధిపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.
అభివృద్ధికి ఐదు మార్గాలు..
1 . కేరళలోని అలప్పీ సరస్సులో వెయ్యి హౌస్ బోట్లు ఉంటాయి. ఇటువంటి హౌస్ బోట్లను కృష్ణానదిలో కూడా ఏర్పాటుచేస్తే పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ బోట్లలోనే ఒకటి రెండు రోజులు గడిపేందుకు కావాల్సిన సౌకర్యాలూ ఉంటాయి
2 . భవానీ ద్వీపంలో డిస్నీల్యాండ్ తరహాలో వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలి. స్విమ్మింగ్‌పూల్స్ కూడా సిద్ధంచేస్తే సమ్మర్లో పర్యాట కులను ఆకట్టుకోవచ్చు.
3 విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా భవానీ ద్వీపంలో వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్‌ను అందుబాటులోకి తేవాలి. నిష్ణాతులైన చెఫ్‌లతో వీటిని తయూరుచేరుుస్తే బాగుంటుంది. అలాగే, పర్యాటకులు షాపింగ్ చేసుకునేందుకు వీలుగా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలి.
4 దుర్గగుడికి-భవానీద్వీపానికి అనుసంధానం ఏర్పాటు చేయాలి. దీనివల్ల గుడికి, ద్వీపానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దుర్గగుడి నుంచి బరం పార్కుకు రోప్‌వే, అక్కడి నుంచి భవానీ ద్వీపానికి బోటింగ్ సౌకర్యం కల్పించాలి.
5. సందర్శకులు జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూసేలా ద్వీపం నుంచి టూరిస్టు బస్సు సౌకర్యం కల్పించాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే భవానీ ద్వీపానికి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.