పోల‘వరం’..ఇక వేగం
సాక్షి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టు (ఇందిరాసాగర్) కల సాకారానికి ఇన్నాళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావిత 47 రెవెన్యూ గ్రామాలను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు రాజ్యసభ, లోక్‌సభ ఆమోదం లభించడంతో ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కానుంది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజాప్రతి నిధుల ఆందోళన మధ్య కేంద్ర ప్రభుత్వం పోలవరం ఆర్డినెన్స్‌ను ఈ నెల 11న లోక్‌సభలో ఆమోదింపజేయగా, సోమవారం రాజ్యసభలోనూ ఆమో దం లభించింది.
రాష్ట్రపతి ఆమోదమే తరువాయి
ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివి జన్‌లోని కుకునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా (41 రెవెన్యూ గ్రామాలు), బూర్గంపాడు పాక్షికంగా (6 రెవెన్యూ గ్రామాలు) మన జిల్లాలో కలవడానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం ఒక్కటే మిగిలివుంది.
తొలగనున్న అడ్డంకులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16,010 కోట్లను కేటాయించారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి రూ.4,054 కోట్ల విలువైన పనులను అప్పగిం చారు. అయితే, ఏటా బడ్జెట్లో అరకొర కేటాయింపులే ఇస్తున్నారు. రెండేళ్లుగా బడ్జెట్లో రూ.800కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకూ కేటాయింపులు ఇస్తున్నారు. ఈ ఏడాది తాజా బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దాదాపు 1,400 ఎకరాల భూసేకరణ ఇంకా జరగలేదు. ప్యాకేజీ-1లో 12.10 ఎకరాల అటవీ భూమి సేకరిం చాల్సి ఉంది. కోర్టు కేసుల వల్ల జిల్లాలో 551 ఎకరాల భూసేకరణ పూర్తి కాలేదు. ఇవన్నీ వేగంగా జరగాలంటే జాతీయహోదాతో పాటు నిధు లు రావాల్సిఉంది. ఉభయ సభల్లో ముంపు మండలాల విలీనానికి ఆమో దం లభించడంతో భూసేకరణకు కొంతమేర అవాంతరాలు తొలగుతాయి. పునరావాసం ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్)లో నెలకొన్న వివాదాలు సమసిపోనున్నాయి.
కలల ప్రాజెక్టు
జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట గ్రామంలో చేపట్టిన ఇందిరాసాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 80 టీఎంసీల గోదావరి నీటిని కుడి ప్రధా న కాలువ ద్వారా కృష్ణానదికి, 23.44 టీఎంసీల నీటిని విశాఖ పరిసర 560 గ్రామాల తాగునీటి, పరిశ్రమలు, సాగు అవసరాలకు ఎడమ కాలువ ద్వారా సరఫరా చేస్తారు. దీంతోపాటు ఈ నాలుగు జిల్లాల్లో పర్యాటకం, చేపల పెంపకం, జలరవాణా వంటివి అభివృద్ధి చెందుతాయి.