లెక్క తేలింది
గత ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లలో వడగండ్లు, భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఊరట లభించింది. జిల్లాలో 22 మండలాలను ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మండలాల రైతులకు త్వరలో పరిహారం విడుదల కానుంది.
* భారీ వర్షం, వడగళ్లకు దెబ్బ తిన్న మండలాలు 22
* 2013 పంట నష్టంపై ప్రభుత్వ ప్రకటన
* ఏడాదిలో నాలుగు సార్లు నష్టపోయిన రైతన్న
* త్వరలో రూ. 21 కోట్ల పరిహారం విడుదల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘ముందు దగా... వెనక దగా, కుడి ఎడమల దగా దగా’... విత్తనాల కొనుగోలు మొదలుకొని దిగుబడులను అమ్ముకునే వరకు అంతటా రైతులకు అన్యాయమే. ప్రకృతి కరుణించక, ప్రభుత్వం ఆదరించక సమస్యల సుడిగుం డంలో సతమతమవుతున్న అన్నదాతకు అన్నీ కష్టాలే. పరి స్థితులు ప్రతికూలంగా మారడంతో ఈ ఖరీఫ్‌లో సాగు సగ మే కాగా, 2013 ఖరీఫ్, రబీ సీజన్లలోనూ రైతులు వడగ ళ్లు, భారీ వర్షాలతో పంటలు నష్టపోయారు. నాలుగు దఫాలుగా జరిగిన నష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. దీని ఆధారంగా జిల్లాలోని 36 మండలాలకుగాను 22 మండలాలలో రైతులు ప్రకృతి వైపరీత్యా నికి గురయ్యారని ప్రభుత్వం గురువారం ప్రకటిం చిం ది. వీరందరికీ త్వరలోనే రూ.21 కోట్ల పరిహారం విడుదల కానుంది.
వణికించిన వడగళ్లు
2013లో రైతులు నాలుగు పర్యాయాలు భారీ వర్షాలు, వడగళ్ల వర్షాల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. జనవరి 25, 26 తేదీలలో కురిసిన వర్షాలు పంటలను దెబ్బ తీశాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో వరుసగా కురిసిన భారీ వర్షాలకు 580 హెక్టార్లలో మిర్చి, పొద్దు తిరుగుడు, పొగాకు పంటలు ఊడ్చుకుపోయాయి. ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వర్షం రైతులను అతలాకుతులం చేసింది. అక్టోబర్ 24, 25 తేదీలలో కురిసిన భారీ, వడగళ్ల వర్షాల కారణంగా 2,105 హెక్టార్లలో వరి, 970 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
రైతులు పెద్ద మొత్తంలో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాదేశం మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ వ్యవసాయ, రెవె న్యూ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా సర్వే నిర్వహిం చారు. వారు 36 మండలాలలో రూ.52 కోట్ల మేరకు రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. రాష్ట్ర విభజ న, ఎన్నికలు తదితర కారణాలతో పరిహారం మం జూరులో జాప్యం జరిగింది. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం పరిహారం విడుదల చేయనుండటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
బాధిత మండలాలు ఇవే
జిల్లాలోని అన్ని మండలాలలో నష్టం జరిగిన తీరును అధికారులు తమ నివేదికలలో వివరించారు. అయితే కొన్ని మార్గదర్శక సూత్రాలను అనుసరించి 22 మం డలాలలోనే నష్టం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. 14 మండలాలు ఈ జాబితాలో చోటు చేసుకోలేదు. వడగళ్లు, భారీ వర్షాల వల్ల నష్టపోయిన మండలాలలో బాల్కొండ, బీర్కూరు, మోర్తాడ్, దోమకొండ, మాచారెడ్డి, ఆర్మూరు, భిక్కనూర్, లింగంపేట్, కామారెడ్డి, గాంధారి, వర్ని, రెంజల్, నిజామాబాద్, బాన్సువాడ, నవీపేట, కోటగిరి, సిరికొండ, నాగిరెడ్డిపేట్, నందిపేట్, బోధన్ తదితర మండలాలు ఉన్నాయి. వీటిని భవిష్యత్‌లో వడగళ్ల వర్షం వల్ల నష్టం జరిగే మండలాలుగా కూడా గుర్తిస్తారు.