affidavit format
-
అఫిడవిట్లో తప్పిదం! కానీ ఎన్నికల నిబంధనల మేరకు ఒకే..
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పిదం చోటుచేసుకుంది. ఇందిర తన అఫిడవిట్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ఉన్న కాలంలో అప్లికేబుల్ బదులు నాట్ అప్లికేబుల్ అని పూరించారు. ఈ విషయమై సోమవారం ఆర్ఓ కార్యాలయంలో జరిగిన స్క్రూట్నీలో బీజేపీ అభ్యర్థి విజయరామారావుతో పాటు స్క్రూట్నీలో పాల్గొన్న ఇతర అభ్యర్థులు ఆర్‌ఓతో చర్చించారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు ఏ పార్టీ నుంచి బీ–ఫారం జతచేస్తారో దానినే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నియమావళి మేరకు ఆమె నామినేషన్‌ను ఆమోదించామని తెలిపారు. వినయ్‌భాస్కర్.. తప్పుడు అఫిడవిట్.. బీఆర్ఎస్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని బీజేపీ నాయకుడు, న్యాయవాది రావు అమరేందర్‌రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జరిమానా విఽధించిందని, ఈ జరిమానాను చెల్లించాడని, రూ.2 వేలకు పైగా జరిమానా చెల్లిస్తే ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ తాను రూ.1,000 మాత్రమే జరిమానా చెల్లించినట్లు అఫిడివిట్లో చూపించారని ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన వినయ్‌భాస్కర్ నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరారు. ఈసందర్భంగా రావు అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పారదర్శకంగా విధులు, బాధ్యతలు నిర్వహించడం లేదని ఆరోపించారు. రూ.3 వేలు జరిమానా విధించిన జడ్జిమెంట్ ప్రతిని, జరిమానా చెల్లించినట్లు ఆధారాలు అందించినా.. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌పై చర్యలు తీసుకోకుండా ఆమోదించారని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి చదవండి: 'స్వతంత్ర అభ్యర్థుల' ఓట్లు.. మిగతా పార్టీలకు మేలు చేస్తాయా? నష్టం చేస్తాయా? -
కేంద్రం వైఖరిలో పొంతనలేదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పరస్పర విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీంతో అయోమయానికి గురైన అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి.. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వటం చాలా కష్టమని, ఎంతో శ్రమతో కూడుకున్న పనని కోర్టుకు నివేదించారు. మంగళవారం విచారణ మొదలవుతుండగానే.. కేంద్రం గతంలో తెలిపిన వైఖరికి భిన్నమైన వైఖరిని ఇప్పుడు చెప్తోందంటూ ధర్మాసనం తప్పుపట్టింది. ‘నిన్న సమర్పించిన అఫిడవిట్ గతంలో మీరు చెప్పిన దానికి భిన్నంగా ఉంది. చాలా అంశాలపై ఈ అఫిడవిట్ మౌనం దాల్చింది. లేదంటే మరేదో చెప్తోంది. మీరు ఒక వాదన వినిపించారు. కానీ ఈ పత్రాలు మరేదో చెప్తున్నాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపు చట్టబద్ధతను మీరు సమర్థించుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన వివరాలు కావాలని, ఒక్కో క్షేత్రం వారీగా వివరించాలని అటార్నీ జనరల్‌కు చెప్పింది. జస్టిస్ ఆర్.ఎం.లోథా నేతృత్వంలోని జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం.. బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన తాజాగా ప్రశ్నల వర్షం కురిపించింది. తాను ఇచ్చిన సమాధానాలతో ధర్మాసనం సంతృప్తి చెందకపోవటంతో.. మృదుప్రవర్తన గలవాడిగా పేరున్న వాహనవతి ప్రశ్నల శరపరంపరతో అయోమయానికి, అసహనానికి లోనయ్యారు. ‘ప్రతిదీ నా మెదడులో తీసుకురాలేను. అది చాలా కష్టం. ఎంతో శ్రమతో కూడుకున్న పని. నేను ఒక కోణం గురించి వాదించిన తర్వాత, మరో కోణంపై మరో ప్రశ్న తలెత్తుతుంది. నేను ముందుకెలా వెళ్లగలను? బొగ్గు క్షేత్రం గుర్తింపు గురించి నేను సమాధానం ఇచ్చా. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ గురించి సమాధానం చెప్పా. ఇప్పుడేమో బొగ్గు క్షేత్రం ఎక్కడుందనే దాని గురించి ప్రశ్న’ అని వ్యాఖ్యానించారు. కేటాయింపులకు సంబంధించిన రికార్డులు మొత్తం సమర్పించేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని, ఇప్పటివరకూ విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు చెప్పే దాన్ని మేం ఎలాంటి ప్రశ్నలు అడగకుండా విని, మా తీర్పు ఇవ్వాలి.. లేదా మేం ప్రశ్నలు వేయాలి. మేం ప్రశ్నలు అడిగితే మీరు ఆశ్చర్యపోతున్నారు. మేం ఏం చేయాలి?’ అని వ్యాఖ్యానించింది. విచారణ వాయిదా వేయటానికి నిరాకరించింది.