ఆరు రాష్ట్రాలపై ఏఎఫ్ఐ వేటు
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) కొరఢా ఝుళిపించింది. జాతీయ ఈవెంట్స్‌లో వయసు మీరిన క్రీడాకారులను బరిలోకి దింపినందుకు ఢిల్లీ సహా ఆరు రాష్ట్రాల సంఘాలపై వేటు వేసింది. డోపింగ్‌లో దోషులని తేలిన 14 మంది అథ్లెట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.
ఇటీవల రెండు రోజుల పాటు సమావేశమైన ఏఎఫ్ఐ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ, హర్యానా, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు ఏడాది పాటు పాల్గొనకుండా నిషేధం విధించింది. అయితే సంబంధిత రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు జాతీయస్థాయి పోటీల్లో తమ సొంత రాష్ర్టం తరఫున కాకుండా ఏఎఫ్ఐ గొడుగు కింద పాల్గొనే వెసులుబాటు కల్పించింది.