ముంచెత్తిన ముసురు
జిల్లా అంతటా వాన
=అత్యధికంగా వర్ధన్నపేటలో 6 సెం.మీ.
=పంటలకు మళ్లీ నష్టం
=నల్లబడుతున్న పత్తి
=నేలవాలిన వరి
వరంగల్, న్యూస్‌లైన్ : అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు సగటున 11.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొత్తం 46 మండలాల్లో వర్షం కురువగా... వర్ధన్నపేటలో అత్యధికంగా 6 సెంటీ మీటర్లు కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురుతో రహదారులు జలమయమయ్యాయి. నర్సంపేట, ములుగు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, ఏటూర్‌నాగారం ఏజెన్సీలో వర్షం పడింది.
ఏజెన్సీతో పాటు నర్సంపేట, ములుగు, పరకాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో 33 కేవీ లైన్లు బ్రేక్‌డౌన్ అయ్యాయి. దీంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో ముందస్తుగానే సరఫరాను నిలిపేశారు. లూజ్‌లైన్ల కారణంగా వర్షంతో ఇబ్బం దులు ఏర్పడుతాయని సరఫరా కట్ చేశారు. మంగపేట, ఏటూర్నగారం, తాడ్వాయి, గణపురం, చెల్పూర్ ప్రాంతాలకు రాత్రి వరకు విద్యుత్ సరఫరా చేశారు.
వరంగల్ కార్పొరేషన్లో సాయంత్రం రెండు గంటల పాటు సరఫరాను ఆపేశారు. కార్పొరేషన్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్న వడ్డేపల్లి చెరువు, కాశిబుగ్గ, వివేకానంద కాలనీ, శాంతినగర్, పద్మనగర్, ఎంహెచ్ నగర్, సుందరయ్య నగర్, దేశాయిపేట, సమ్మయ్యనగర్, నయీంనగర్, గోపాల్పూర్ ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది.
పంటలకు ప్రమాదమే..
రెండు రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వానలకు పత్తికి పెను ప్రమాదం వాటిల్లుతోంది. ఇప్పటికే వివిధ తెగుళ్లు పంటలను నాశనం చేస్తుండగా... ఈ వానలతో మరింత పెరిగే ప్రమాదముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడిప్పుడు పత్తి కాయలు పగులుతుండగా... బయటకు వచ్చిన పత్తి మొత్తం నల్లబడుతోంది. కాయలు సైతం నల్లబారుతున్నాయి. రెండు రోజులు పత్తి కాయలు నీటితో నానడంతో మొదటి దిగుబడి గణనీయంగా తగ్గనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక పొట్ట దశలో ఉన్న వరికి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వర్షానికి వరి నేలకు వంగుతోంది. దీంతో గొలుసులు కిందకు వేలాడి నీటిలో నానుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప పంట పూత దశలో, పసుపు దుంప పోసుకునే దశలోఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి చేనుల్లో పలు రకాల తెగుళ్లు సోకే అవకాశాలున్నాయని వరంగల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర డాక్టర్ రావుల ఉమారెడ్డి తెలిపారు. తెగుళ్ల వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని రైతులు తెగుళ్ల ఉనికిని సకాలంలో గుర్తించాలని ఆయన సూచించారు. మొక్కజొన్న కంకులు కోసిన రైతులు.. అవి ఎండక నష్టపోతున్నారు. వర్షం వల్ల మొక్కజొన్న కంకులు తడిసి మొలకెత్తే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రాంతాల్లో అధికం
అత్యధికంగా వర్దన్నపేటలో 60.6మి.మి. కురిసింది. అదే విధంగా ఆత్మకూర్‌లో 36.2 మి.మి, శాయంపేటలో 32, దేవరుప్పులలో 28.2, గూడూరులో 24.2, నెక్కొండలో 23.2, పాలకుర్తిలో 26.2, జఫర్గడ్లో 14.6, చేర్యాలలో 16.4, నర్మెట్టలో 17.8, బచ్చన్నపేటలో 12.4, ధర్మసాగర్లో 14.4, లింగాలఘన్‌పూర్‌లో10, హసన్‌పర్తిలో14.4, హన్మకొండలో10.2, రాయపర్తిలో 18.2, కొత్తగూడలో 12.8, ఖానాపూర్‌లో 7.2, నర్సంపేట, చెన్నారావుపేటల్లో 11.6, పర్వతగిరిలో 16.4, సంగెంలో 14.2, గీసుగొండలో 15.2, గోవిందరావుపేటలో 11.6, వరంగల్‌లో 8.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.