మ్యూచువల్ ఫండ్‌కు కొంచెం ఖేదం, కొంచెం మోదం
- ఏజెంట్ల సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు రద్దు
- ఫండ్లు విలీనమైతే పన్ను ప్రయోజనాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఖరీదైన వ్యవహారం కానున్నది. మ్యూచువల్ ఫండ్ ఏజెంట్లకు ఇచ్చే సర్వీస్ ట్యాక్స్ మినహాయింపును ఆర్థిక మంత్రి రద్దు చేశారు. అయితే ఒకే విధమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు విలీనమైతే ఇన్వెస్టర్లకు పన్ను విషయంలో ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారు.
అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)కి చెందిన ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే సర్వీస్ ట్యాక్స్ మినహాయింపును రద్దు చేస్తున్నట్లు బడ్జెట్లో అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఈ సర్వీస్ ట్యాక్స్‌ను ఏఎంసీయే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఒకేవిధమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు విలీనమైతే, ఇన్వెస్టర్‌కు పన్ను తటస్థత లభిస్తుంది.
ఇప్పటివరకూ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో విలీనమైతే, దానిని మ్యూచువల్ ఫండ్ యూనిట్ల సాధారణ బదిలీగా పరిగణించేవాళ్లు. దీనికి ఇన్వెస్టర్లు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ చర్య కారణంగా భవిష్యత్తులో చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల విలీనం జరుగుతుందని అంచనా. ప్రస్తుతం 45 మ్యూచువల్ ఫండ్స్ రూ.12 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను నిర్వహిస్తున్నాయి.