వృద్ధులపై సొంత ఇంట్లోనే శారీరకంగా, మానసికంగా వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కాలంలో దేశంలో దాదాపు 73 శాతం వృద్ధులపై వేధింపులు పెరిగాయి. ‘ఏజ్‌వెల్ ఫౌండేషన్’ తాజాగా తన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ఈ ఫౌండేషన్ 5,000 మంది వృద్ధులపై అధ్యయనం నిర్వహించింది. కరోనా కాలంలో తమ కష్టాలు పెరిగిపోయాయని 82 శాతం మంది బదులిచ్చారు. తమ జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పారు. కుటుంబసభ్యుల నుంచే తమపై వేధింపులు పెరిగాయని 73 శాతం మంది తెలిపారు. వ్యక్తిగత సంబం ధాలు క్షీణించడమే దీనికి కారణమని వీరిలో 61 శాతం మంది పేర్కొన్నారు.
సన్నిహితుల నిర్లక్ష్యం
సన్నిహితులే తమను నిర్లక్ష్యం చేశారని 65 శాతం మంది అన్నారు. కుటుంబంలోనే కాకుండా సమాజంలోనూ చీత్కారాలను చవిచూడాల్సి వచ్చిందని 58 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇంట్లోనే శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదుర్కొన్నామని ప్రతి ముగ్గురిలో ఒకరు (35.1 శాతం మంది) వాపోయారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్, లాక్డౌన్ ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిందని, వృద్ధులపై ఈ ప్రభావం ఎన్నోరెట్లు అధికంగా ఉందని ఏజ్‌వెల్ ఫౌండేషన్ చైర్మన్ హిమాన్షు రథ్ ఉద్ఘాటించారు.
కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు, నిరాదరణ విషయంలో వృద్ధులు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. వారికి అండగా నిలిచే చట్టాలు, వ్యవస్థలు, హక్కుల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. చాలామంది వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులపైనే ఆధారపడాల్సి వస్తోందని, వేధింపులకు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇక వృద్ధ మహిళల విషయంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు.
చదవండి: ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి