బాబూ...ఇదేం తీరు!
పింఛన్ లబ్ధిదారుల మెడపై కత్తి
పింఛన్ నుంచి ఇంటి పన్ను వసూలు
ఎలా బతికేది ‘బాబూ...’ ఎల్.ఎన్.పేట : ‘అధికారంలోకి వస్తే వికలాంగులకు నెలకు రూ.1500, వితంతు, వృద్ధాప్య, చేనేత, కళ్లుగీత కార్మికులకు నెలకు రూ.వెయ్యి పింఛన్.. ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే మీ ఇంటికే పంపిస్తాం...’ ఇది ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన బూటకపు హామీ. ఈ హామీలు బూటకమని తెలుసుకోలేని ప్రజలు ఓట్లు వేశారు. గద్దెనెక్కించారు. హామీల అమలుకు దిక్కు లేకుండా పోతుంది. పోనీ అమలు చేసిన హామీలపై నెలకో విధమైన కోత తప్పడం లేదు. పింఛన్దారుల డబ్బులపై ఇంటి పన్ను రూపంలో కోత పడింది. పంచాయతీ కార్యదర్శులపై ఇంటి పన్ను లక్ష్యాల భారం పెట్టడంతో మరో గత్యంతరం లేక పింఛన్ లబ్ధిదారుల నుంచి వారి ఇళ్లకు చెందిన ఇంటి పన్నును వసూలు చేసుకుంటున్నారు. ఒక్కోక్క పింఛన్ దారుని నుంచి రూ.100 నుంచి రూ.400ల వరకు ఇంటి పన్ను వసూలు చేసి మిగిలిన పింఛన్ డబ్బులతో పాటు ఇంటి పన్ను రశీదును చేతిలో పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. చాలీచాలని డబ్బులతో నెలంతా ఎలా బతికేది ‘బాబూ...’ అంటు పలువురు వృద్ధులు, వికలాంగులు వాపోతున్నారు. మండలంలో పింఛన్దారుల పరిస్థితి ఇలా ఉంది. వృద్ధాప్య పింఛన్లు 1380, చేనేత 41, వితంతు 886, అభయహస్తం 379, వికలాంగులు 383, ఇతర పింఛను దారులు 118మంది ఉన్నారు. వీరిలో పురి గుడిసెల్లో ఉన్న వారే అధికశాతం మంది ఉన్నారు.
రూ.16లక్షల లక్ష్యం
మండలంలో ఇంటి పన్ను వసూలు చేసేందుకు ఇక్కడి పంచాయతీ అధికారితో పాటు పంచాయతీ కార్యదర్శులు సుమారు 9,500 ఇళ్లు నుంచి రూ.5.50లక్షలు లక్ష్యంగా తీసుకున్నారు. దీన్ని మూడు రెట్లుకు పెంచిన ప్రభుత్వం ఏకంగా ముక్కుపిండి మరీ రూ.16లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణరుుంచింది. మార్చి నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకోకపోతే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో వేరే గత్యంతరం లేక బలవంతపు వసూళ్లుకు పూనుకున్నారు.
ఏమి సౌకర్యాలు కల్పించారని?
ఊరు పుట్టినప్పుడు ఇళ్లు కట్టుకున్నామని ఇప్పటి వరకు ఎవరు ఇంటి పన్ను అని అడగలేదని ఇప్పుడే ఇంటిపన్నులు గుర్తుకు వచ్చాయా? అంటూ పంచాయతీ కార్యదర్శులను పలువురు నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు లేని పన్నుల భారం ఇప్పుడే ఎందుకు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి ఏమి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఇంటి పన్ను కట్టాలో తెలియజేయాలని నిలదీస్తున్నారు. తాగునీరుకు కుళాయిల్లేవు, వీధి దీపాలు వెలగవు, పారిశుధ్యం పట్టించుకోరు, సీసీరోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధులు ఊడ్చేవారు ఎప్పుడు రారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పన్ను ఎందుకు కట్టాలో అధికారులు, పాలకులు తెలియజేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.