అదిరిపోయిన అహనా పెళ్లంట!
ఆహా నా పెళ్లంట.. ఈ చిత్రం పేరు వింటే చాలు.. మొన్న, నిన్నటి, నేటి తరాలేకాదు ఇక ముందు వచ్చే తరాలు కూడా కడుపుబ్బ నవ్వాల్సిందే. ఈ చిత్రానికి ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించగా దానికి రామానాయుడే నిర్మాతగా వ్యవహరించారు. బ్రహ్మానందాన్ని కమెడియన్గా పూర్తిస్థాయిలో నిలబెట్టిన సినిమా అది. కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్.. ఇలా ఎంతోమందికి ఆ సినిమా మంచి లైఫ్ ఇచ్చింది.
సున్నితమైన అంశాలతో కుటుంబ కథ చిత్రాలను నిర్మించడంలోనే కాకుండా మనుసును రంజింప చేసే చిత్రాలను నిర్మించడంలోను ఆయనది అందె వేసిన చేయి. ప్రేక్షకులకు ఏ మాత్రం నష్టం జరగని విధంగా కథలను ఎంపిక చేయడంలోను, అలాంటి కథలను తీసుకొచ్చినవారికి అవకాశం ఇవ్వడంలోనూ రామనాయుడు ఎప్పుడూ ముందుండేవారు. ఇలా 155 చిత్రాలను ఒంటి చేత్తో నిర్మించి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కించుకున్నారు.