Ahmed Adeeb
-
తూత్తుకుడిలో అదీబ్
సాక్షి, చెన్నై : మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ తూత్తుకుడి గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించారు. ఈ సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని రాయబార, ఐబీ వర్గాలు విచారిస్తున్నాయి. 2015లో మాల్దీవుల ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన అహ్మద్ అదీబ్‌పై అక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయి. బాంబ్ పేలుళ్ల కేసులు కూడా ఉండడం, ఆయన్ను అరెస్టు చేసి, విడుదల కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో తూత్తుకుడి నుంచి ఈనెల 11న మాల్దీవులకు సరకుల లోడుతో ఓ నౌక వెళ్లింది. ఈనెల 27 ఆ నౌక అక్కడి నుంచి తిరుగు పయనం అయింది. ఇక్కడి నుంచి నౌక బయలు దేరిన క్రమంలో అందులో తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 8 మంది ఇండోనేషియాకు చెందిన వారు. ఒకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. తిరుగు పయనంలో అదనంగా ఓ వ్యక్తి చేరడంతో తమిళనాడుకు చెందిన వ్యక్తికి అనుమానాలు రేకెత్తించాయి. తూత్తుకుడికి 30 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో తమిళనాడు వ్యక్తి సంబంధిత తమ సంస్థకు సమాచారం అందించారు. తిరుగు పయనంతో పది మంది వస్తున్నట్టుగా అతడు ఇచ్చిన సమాచారంతో ఇక్కడి పోలీసుల్ని అప్రమత్తం చేశారు. తూత్తుకుడి పోలీసులతో పాటు మెరైన్, కోస్టు గార్డ్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. తూత్తుకుడికి 20 నాటికన్ మైళ్ల దూరంలో నౌక ఉండగా, దానిని చుట్టుముట్టారు. అందులో ఉన్న వ్యక్తి గురించి విచారించగా, ఆయన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అహ్మద్ అదీబ్గా తేలింది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా, భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఆయన్ను ఐబీ( ఇంటెలిజెన్స్ బ్యూరో) వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. తూత్తుకుడి ఓడరేవుకు చేరుకున్న అనంతరం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. రాయబార కార్యాలయ వర్గాలు సైతం విచారణలో నిమగ్నం అయ్యాయి. కాగా, అక్రమ చొరబాటు వెలుగులోకి రావడంతో తూత్తుకుడి మార్గం గుండా విదేశీ శక్తులు భారత్‌లోకి చొరబడే పరిస్థితులు ఉండడం భద్రతా పరంగా ఆందోళన కల్గిస్తున్నది. దీంతో స్థానిక పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరకుల గోడౌన్లు, అక్కడి సంస్థల మీద నిఘా పెంచారు. -
మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అరెస్టు
ట్యూటికోరన్: మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అబ్దుల్ గఫూర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తమిళనాడులోని ట్యూటికోరన్ ఓడరేవులో ఆయనను అరెస్టు చేశారు. టగ్ బోటులో ప్రయాణిస్తూ.. క్రూ మెంబర్‌గా చెప్పుకొని అక్రమంగా భారత్‌లో వచ్చేందుకు ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఆయన భారత్‌కు వచ్చారని, అక్రమంగా అదీబ్ దేశంలోకి వచ్చే అగత్యం ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని అధికార వర్గాలు తెలిపాయి. మాల్దీవులు మాజీ ఉపాధ్యక్షుడి అరెస్టుపై సమాచారమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖకు ఐబీ ఓ రిపోర్ట్ పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మాల్దీవుల ప్రభుత్వంతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మీడియాకు తెలిపారు. -
మాల్దీవుల ఉపాధ్యక్షుడి అరెస్ట్
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్(33)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గత నెల 28న యమీన్ సౌదీ అరేబియా తీర్థయాత్ర ముగించుకుని తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బోటులో బాంబు పేలింది. ప్రమాదం నుంచి యమీన్ సురక్షితంగా బయటపడగా, ఆయన భార్య, ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దేశ అధ్యక్షుడిని హత్య చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో అదీబ్‌ను అరెస్ట్ చేసినట్టు, ఆయన్ను ధూనిధో జైలుకు తరలించినట్టు హోంమంత్రి ఉమర్ నసీర్ తెలిపారు. సింగపూర్ నుంచి స్వదేశానికి చేరుకున్న అదీబ్‌ను మాల్దీవుల ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఉపాధ్యక్షునిగా ఉన్న మహమ్మద్ జమీల్‌ను దేశద్రోహ ఆరోపణలతో పదవి నుంచి తప్పించిన అధ్యక్షుడు యమీన్.. ఆ స్థానంలో అదీబ్‌ను మూడు నెలలక్రితం నియమించారు. తనపై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో రక్షణ మంత్రి మూసాఅలీ జలీల్‌ను పది రోజులక్రితం తొలగించిన యమీన్.. తాజాగా అదీబ్ అరెస్ట్‌కు కొన్ని గంటల ముందుగా పోలీస్ చీఫ్ హుస్సేన్ వాహిద్‌పై సైతం వేటేయడం గమనార్హం.