యాచక కోటీశ్వరురాలు మృతి
జెద్దా: సౌదీ అరేబియాలో వందేళ్ల వయసున్న ఈషా అనే యాచకురాలు కన్నుమూసింది. పేరుకు యాచకురాలే అయినా ఆమె కోట్ల సంపదను కూడబెట్టింది. ఆమె వద్ద ఉన్న బంగారు నాణేలు, ఆభరణాలు, భవనాలు, భూముల విలువ పదిలక్షల అమెరికన్ డాలర్లకు పైబడే (సుమారు రూ.6 కోట్లపైనే) ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జెద్దాలో సుమారు 50 ఏళ్లపాటు ఆమె భిక్షాటన చేసినట్టు ఈషాకు పరిచయస్తుడైన అహ్మద్ అల్ సయీది తెలిపారు.
అల్ బలాద్ జిల్లాలో ఈషాకు నాలుగు భవనాలు ఉన్నాయి. ఆమెకు ప్రస్తుతం నా అన్నవాళ్లెవరూ లేరని, తల్లి, ఓ సోదరి ఉంటే గతంలోనే మృతిచెందారని సయీది తెలిపారు. వారి ఆస్తికూడా ఈషాకే వచ్చిందని, ఆమె వీలునామా గురించి ప్రభుత్వ అధికారులకు తెలపగా ఎలాంటి స్పందన లేదని ఆయన చెప్పారు. తన సంపదను పేదలకు పంచాల్సిందిగా ఈషా వీలునామాలో రాసిందని వెల్లడించారు. ఈషా తమనుంచి ఎప్పుడూ అద్దె వసూలు చేయలేదని ఆమె భవనాల్లో నివసిస్తున్నవారు ఈ సందర్భంగా చెప్పారు.