కర్నూలులో ఎయిమ్స్, కృష్ణా వాటర్ బోర్డును ఏర్పాటు చేయండి
సాక్షి, కర్నూలు: వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కర్నూలులో ఎయిమ్స్ కళాశాల, కృష్ణా వాటర్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్లమెంట్ హౌస్‌లో శుక్రవారం విడివిడిగా కలిసి విజ్ఞప్తి చేశారు.
కర్నూలులో ఎయిమ్స్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల సీమ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, అలాగే రూ. 250 కోట్లతో కర్నూలు మెడికల్ కళాశాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించాలని, మరో రూ.30 కోట్లతో ఆర్పీఎన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసిన సందర్భంలో కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని, అలాగే తుంగభద్ర, వేదావతి నదులపై సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు సహకరించాలని ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి చేశారు.