పుల్లెల శ్రీరామచంద్రుడు కన్నుమూత
హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంస్కృతాచార్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు (88) బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్ను మూశారు. ఆయన 200కి పైగా సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర గ్రంథాలను రచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతిగా, సంస్కృత అకాడమీ సంచాలకుడిగా, సురభారతి కార్యదర్శిగా, సంస్కృత భాషా ప్రచారక్ సమితి కులపతిగా, సంస్కృత భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు.
ఆయన తెలుగులోకి అనువదించిన ‘వాల్మీకి రామాయణం’ ప్రతి తెలుగువారి ఇంటా కనిపిస్తుంది. సంస్కృతానికే మారుపేరుగా నిలిచిన రామచంద్రుడు మృతి సంస్కృతాభిమానులను శోకసంద్రంలో ముంచివేసింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజమండ్రి సమీపంలోని కోనసీమలోని ఐనవెల్లి గ్రామంలో జన్మించిన రామచంద్రుడుఆరు దశాబ్దాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
పుల్లెల శ్రీరామచంద్రుడు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అనువదించటంతో పాటు.. తెలుగు, సంస్కృతంలో ఆయన రచనలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. పుల్లెల సంస్కృత అకాడమీలో దశాబ్దానికి పైగా సేవలు అందించటంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృత విభాగం అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. కాగా, పుల్లెల శ్రీరామచంద్రుడు మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.