Air Car
-
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కారు గాల్లో ఎగిరిపోతే?
కారుకు ఉన్నట్టుండి రెక్కలొచ్చేస్తాయి. కారు అట్లానే గాల్లోకి ఎగిరి.. హాయిగా చక్కర్లు కొడుతుంది. ఊరవతలో, మరో సిటీలోనో రోడ్డుపై అట్లా ల్యాండ్ అవుతుంది. ఎప్పట్లా మారిపోయి ఇంటికెళ్లిపోతుంది. ఇదేదో హాలీవుడ్ సినిమాలో సీన్లా ఉందికదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. స్లొవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ కంపెనీ రూపొందించిన ‘ఎయిర్ కార్’ ఇటు కార్లా ప్రయాణించి, అటు చిన్న విమానంలా గాల్లో ఎగిరింది. 160 హెచ్‌పీ సామర్థ్యమున్న బీఎండబ్ల్యూ ఇంజిన్‌తో దీనిని రూపొందించారు. సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. ఇద్దరు ప్రయాణిం చొచ్చు. స్లొవేకియాలోని నిట్రా సిటీ నుంచి బయలుదేరిన ఈ ఎయిర్‌కార్.. 8 వేల అడుగుల (సుమారు రెండున్నర కిలోమీటర్లు) ఎత్తులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 35 నిమిషాల తర్వాత బ్రటిస్లావా నగరంలో ల్యాండ్ అయింది. కారులా ప్రయాణిస్తున్నప్పుడు దీని రెక్కలు రెండు వైపులా పక్కకు ముడుచుకుంటాయి. గాల్లో ఎగిరే ముందు విచ్చుకుంటాయి. ఇదంతా మూడు నిమిషాల్లో జరిగిపోతుంది. ప్రస్తుతం ప్రయోగం చేసింది ప్రొటోటైప్ అని.. అసలు ఎయిర్‌కార్‌ను 300 హెచ్‌పీ ఇంజిన్‌తో రూపొందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. అది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని.. ఏడాదిలోపు దీనిని మార్కెట్లోకి తీసుకొ స్తామని వెల్లడించింది. ధర ఎంత ఉంటుందన్న వివరాలేమీ వెల్లడించలేదు. -
ఈ కారుకు పవనమే ఇంధనం
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఫైనలియర్ విద్యార్థులు పవనశక్తి(గాలి)తో నడిచే కారును తయారు చేశారు. కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు సాయికిరణ్, అనిల్‌రెడ్డి, ప్రశాంత్, నరేశ్ బుధవారం కళాశాలలో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా రూ.60 వేల ఖర్చుతో 45 రోజులపాటు శ్రమించి ఇంధనంతో పనిలేని, కాలుష్యం వెదజల్లని కారును వీరు రూపొందించారు. తాము తయారు చేసిన కారుకు ఉన్న ఫ్యాన్ తిరిగినప్పుడు.. ఆ గాలి యాంత్రికశక్తిగా మారి..విండ్ టర్బైన్ జనరేటర్ సిస్టం ద్వారా విద్యుచ్ఛక్తి తయారై ఎలక్ట్రిక్ (బ్యాటరీలు) మోటార్ల ద్వారా కారు నడుస్తుందని విద్యార్థులు వివరించారు. అయితే కారు ముందుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో నడిస్తేనే ఫ్యాన్ తిరిగి విద్యుచ్చక్తి తయారవుతుందన్నారు. వాహనం ఎంత స్పీడ్‌గా వెళ్తే అంతగా బ్యాటరీ చార్జి అవుతుందని..ఎలాంటి కాలుష్యం వెదజల్లదని విద్యార్థులు తెలిపారు.