గాలి.. కొనాలి..
గాలి కొనాలి! అవును మరి.. చైనాలో ఫ్రెష్ ఎయిర్ కావాలంటే మీరు ఆ పని చేయాల్సిందే. మినరల్ వాటర్ బాటిళ్ల తరహాలో ఈ ఫ్రెష్ ఎయిర్ బాటిళ్లను కూడా పైసలిచ్చి కొనాల్సిందే. చైనాలో ఇటీవల వాయు కాలుష్యం బాగా పెరిగిపోవడంతో పర్యాటకులకు ఆక్సిజన్ బాటిళ్లను అమ్మాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అక్కడి వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.
పర్యాటక పథకంలో భాగంగా దేశంలోని ఎకో టూరిజం జోన్లుగా పేరొందిన ఫాన్జింగ్, లీగాంగ్ పర్వత ప్రాంతాల వద్ద గాలిని సేకరించి..జూన్ 20 నుంచి అమ్మనున్నారు. ఫాన్జింగ్, లీగాంగ్ పర్వత ప్రాంతాల వద్ద అత్యంత పరిశుద్ధమైన గాలి దొరుకుతుందట. ప్రధానంగా గుజౌ ప్రావిన్స్‌లో వీటిని ఎక్కువగా అమ్మనున్నారు. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ అనుమతి కూడా ఇచ్చారు. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారన్న దాన్ని నిర్ణయించడంలో నాణ్యమైన గాలి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఇక ప్రైవేటు సంస్థలైతే.. ప్రభుత్వం కంటే ముందుగానే అమ్మడానికి సన్నాహాలు చేసేసుకుంటున్నాయి.