అందుకే మీతో మాట్లాడను...
మీడియాపై విజయ్ మాల్యా వ్యాఖ్యలు
బెంగళూరు: వివిధ వివాదాలతో కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటున్న పారిశ్రామిక దిగ్గజం విజయ్ మాల్యా తాజాగా యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్ఎల్) వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మీడియాపై కస్సుబుస్సులాడారు. యూఎస్ఎల్లో వాటాలు తగ్గించుకుంటున్నారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ప్రస్తుతం బ్యాంకులకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బకాయిల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మాల్యా చెప్పారు.
ఏ విధంగా వాటాలు తగ్గించుకోబోతున్నారన్న ప్రశ్నలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రశ్నలెలా ఉన్నాయంటే.. నేనో కొత్త సూట్ కొనుక్కుంటున్నాను అంటే.. ఎక్కడ కొంటున్నాను.. టైలరు ఎవరు లాంటి ప్రశ్నలు మీరు వెంటనే సంధిస్తారు. వాటీజ్ దిస్ యా? నేను ఒక విషయం చెప్పాను. అంతే. దాన్ని మీ ఇష్టమొచ్చినట్లు మార్చేసి, వక్రభాష్యం చెప్పాలనుకోవడం సరికాదు. అందుకే మీడియాతో నేను మాట్లాడను.
ఒక్క మాట మాట్లాడితే దానికి పది అర్థాలు వెతుకుతారు’ అంటూ మాల్యా వ్యాఖ్యానించారు. అటు, ఆయన్ను యూఎస్ఎల్ చైర్మన్గా తొలగించాలంటూ సమావేశంలో తీర్మానించవచ్చన్న వార్తలపై స్పందిస్తూ.. ‘మీడియాలో వచ్చే కథనాలపై నేను ఎందుకు స్పందించాలి. ఎవరో ఏదో ఊహాజనితంగా రాసేస్తారు. మొత్తం మీడియా అంతా దాన్ని పట్టుకుని రకరకాల ప్రశ్నలు వేస్తుంది. ఇది కరెక్టేనా’ అని ప్రశ్నించారు.
రిటైర్మెంటా.. ఆలోచిద్దాం..
మరికొద్ది రోజుల్లో 60వ పడిలోకి అడుగెట్టనున్న మాల్యా .. రిటైర్మెంట్పైనా తనదైన రీతిలో స్పందించారు. యూఎస్ఎల్ బోర్డు నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారన్న విలేఖరుల ప్రశ్నలపై మాట్లాడుతూ.. అరవై ఏళ్లు వచ్చాకా ఆలోచిస్తానన్నారు. ‘మీరు ప్రతి మాటకు వక్రభాష్యాలు చెబుతారు. సాధారణంగా 60 ఏళ్లు వచ్చాకా రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని, జీవితాన్ని ఆస్వాదించాలని అప్పుడెప్పుడో నేను చెప్పాను.
ఇలా ఆలోచించడంలో తప్పేమీ లేదు. ప్రస్తుతం చాలా మంది నేను అరవయ్యో పడిలోకి అడుగుపెడుతున్నానని గుర్తు చేస్తున్నారు. అయితే, నేను ఇప్పుడే రిటైర్ కావడం లేదు. 60 ఏళ్లు రానివ్వండి అప్పుడు ఆలోచిద్దాం’ అని పేర్కొన్నారు. 1955 డిసెంబర్ 18న జన్మించిన మాల్యా మరికొద్ది రోజుల్లోనే అరవయ్యో పడిలోకి అడుగుపెట్టబోతున్నారు.