ఆశల పల్లకిలో...
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ‘పశ్చిమ’ ప్రజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు రేకెత్తించారు. రాష్ట్ర రాజధాని ప్రకటనలో భాగంగా గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ నరసాపురం తీరప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, కొల్లేరులో పర్యాటక అభివృద్ధి, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం పునరుద్ధరణ, పేరుపాలెం బీచ్ అభివృద్ధి, వివిధ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలన్నీ ఎంతవరకు సాకారమవుతాయో వేచి చూడాల్సిందే.
గూడెం నుంచి గగన విహారానికి గ్రీన్ సిగ్నల్
తాడేపల్లిగూడెం : జిల్లా వాసుల గగన విహారం కల త్వరలోనే సాకారం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీలో ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని ప్రకటించారు. జిల్లాలో తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. చంద్రబాబు హామీ నెరవేరితే త్వరలోనే జిల్లా వాసులు గగన విహారం చేసేందుకు అవకాశం కలుగుతుంది. విమానంలో ఎగిరే చాన్స్ లభిస్తుంది.
స్థానిక ఎయిర్‌స్ట్రిప్‌ను విమానాశ్రయంగా మార్చనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలిస్తామని స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు. విమానాశ్రయ భూములను పట్టాలిచ్చేందుకు సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని, ఫైల్ ఆయన వద్ద ఉందని కొంతకాలం క్రితం మంత్రి ప్రకటించారు. ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తారా, పేదల ఇళ్లకు పట్టాలిస్తారా అనే విషయం తేలాల్సి ఉంది.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మాణం
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అత్యవసర కార్యకలాపాల కోసం గూడెంలో బ్రిటిష్ వారు ఎయిర్‌స్ట్రిప్ నిర్మించారు. అప్పట్లో 650 ఎకరాలు భూమిని సేకరించారు. యుద్ధం ముగిశాక ఈ ప్రాంతం మొత్తం రక్షణ శాఖ ఆధీనంలో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు కోటి రూపాయలు చెల్లించడంతో ఈ భూములు ప్రభుత్వానికి బదలాయించారు. అప్పటి నుంచి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉన్నాయి. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక గూడెంలో విమానాశ్రయం అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సర్వే నిర్వహించి టెండర్లు పిలవగా సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థ మైటాస్ కంపెనీకి ఖరారయ్యింది. అనంతరం సత్యంలో తలెత్తిన సంక్షోభం, వైఎస్ అకాలమరణంతో విమానాశ్రయం ఏర్పాటు అటకెక్కింది.
1.90 కిలోమీటర్ల రన్‌వే
విమానాశ్రయానికి గూడెం ప్రాంతం చాలా అనుకూలం. ఇప్పటికే విండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను హైదరాబాద్‌లోని విమానయాన వాతావరణ కేంద్రం ఇచ్చింది. ఇక్కడ రన్‌వే 1.90 కిలోమీటర్ల పొడవు ఉంది. విమానాలు దిగడానికి కిలోమీటరున్నర పొడవైన రన్‌వే ఉంటే చాలు. దానికంటే 40 మీటర్లు పొడవైన చెక్కు చెదరని రన్‌వే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ భూమి 280 ఎకరాలు అందుబాటులో ఉంది. ఇంకాస్త భూమి సేకరిస్తే చాలు.
ఏలూరు వాసులు ట్రాఫిక్ వలయాన్ని దాటుకొని గన్నవరం విమానాశ్రయం వెళ్లే కంటే నలభై నిమిషాల్లో గూడెం చేరుకోవచ్చు. జిల్లాకు గూడెం బౌగోళికంగా మధ్యలో ఉండడం అనుకూలం. జిల్లా వాసులతో పాటు రావులపాలెం ప్రాంత ప్రజలు కూడా హైవే ద్వారా త్వరగా చేరుకోవచ్చు. కార్గో సౌకర్యం కూడా ఏర్పడితే ఉల్లిపాయలు, రొయ్యలు, చేపలు, బియ్యం వంటి వాటిని ఇతర ప్రాంతాలకు త్వరగా చేర్చవచ్చు.
మారనున్న‘గూడెం’ ముఖచిత్రం
ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నెరవేరితే తాడేపల్లిగూడెం ముఖచిత్రం మారనుంది. జలరవాణా పునరుద్ధరణ, మరో పక్క విమానాశ్రయం ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యాన పరిశోధనాస్థానాల రాకతో పట్టణానికి మహర్దశ పట్టే అవకాశం ఉంది. బకింగ్ హామ్ కెనాల్ రవాణా సాగే సమయంలో గూడెం పట్టణం ప్రముఖ జలరవాణా కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. మళ్లీ జల రవాణా ప్రారంభమైతే మరింత అభివృద్ధి సాధించనుంది.
దీనికితోడు గూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వెంకట్రామన్నగూడెంలో ఉన్న కేంద్ర అటవీపర్యావరణ భూముల్లో ఏర్పాటు కావచ్చని అంచనా. మరోవైపు ఉద్యానవర్సిటీ వద్ద పుష్ప పరిశోధనా స్థానం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏర్పాటు కావాలంటే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గట్టిగా లాబీయింగ్ చేయాల్సి ఉంది.
తీరంపై కనికరం
నరసాపురం (రాయపేట) : జిల్లాలోని తీరప్రాంతంపై ప్రభుత్వం ఎట్టకేలకు కనికరం చూపించింది. నరసాపురం తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్రకటన తీరప్రాంత వాసుల్లో కొత్త ఆశలను చిగురింపచేశాయి. నరసాపురం తీరప్రాంతం దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కాకినాడ, విశాఖపట్టణం, నెల్లూరు తీరప్రాంతాల అభివృద్ధికే పాలకులు ఇప్పటి వరకు మొగ్గుచూపారు.
దీంతో మన జిల్లాలోని తీరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో హార్బర్ నిర్మాణం, మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు లేసు పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చేతివృత్తుల కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎంతమేరకు సాకారమవుతాయో వేచి చూడాల్సి ఉంది.
19 కిలోమీటర్ల తీర ప్రాంతం
నరసాపురం తీరప్రాంతం సుమారు 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దశాబ్దకాలంగా తీరప్రాంత వాసులను ఊరిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం నేటికీ నోచుకోలేదు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా నరసాపురం మండలం బియ్యపుతిప్పవద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగితే తీరప్రాంత గ్రామాలైన బియ్యపుతిప్ప, వేములదీవి తూర్పు, వేములదీవి పడమర, చినమైనవానిలంక, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు తదితర గ్రామాల రూపురేఖలు మారినట్టే.
పర్యాటక కేంద్రంగా పేరుపాలెం బీచ్
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు పేరుపాలెం బీచ్‌లో పర్యటిస్తుంటారు. పర్యాటకులకు అనుగుణంగా ఇక్కడ రీసార్ట్స్ ఏర్పాటు చేస్తే టూరిజం ప్రాంతంగా తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ
ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన లేసు అల్లికల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కేంద్రం బడ్జెట్లో లేసు పరిశ్రమను మెగా క్లష్టర్‌గా అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లకు పైగా ప్రత్యేక నిధులు వెచ్చించిన విషయం విధితమే. ఈ పరిశ్రమకు మరింత చేయూతనిచ్చి దీనిపై ఆధారపడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు వెచ్చించి చేతి వృత్తులకు సంబంధించి ప్రత్యేక కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఏలూరు ‘స్మార్ట్’ కాదట
ఏలూరు సెంట్రల్ : ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీల్లో ఒకదానిగా చేరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ మాగంటి బాబు హామీలు నెరవేరలేదు. ముఖ్యమంత్రి గురువారం ప్రకటించిన స్మార్ట్ సిటీలో జాబితాలో ఏలూరుకు స్థానం దక్కలేదు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థ మొదటి సమావేశంలో టీడీపీకి చెందిన కార్పొరేటర్ నాయుడు పోతురాజు ఏలూరును స్మార్ట్ సిటీగా ఎంపిక చేసే విషయాన్ని కౌన్సిల్లో లేవనెత్తారు. దీనిపై ఎంపీ బాబు హామీ ఇచ్చారు.
ఎన్నికల ముందు, తర్వాత కూడా ఏలూరును స్మార్ట్ సిటీ చేస్తామన్న చంద్రబాబు దాన్ని పూర్తిగా విస్మరించారు. ఏలూరుకు ఏ ఒక్క వరాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్ర నూతన రాజధానిగా ప్రకటించిన విజయవాడకు సమీపంలో ఉన్న ఏలూరును అభివృద్ధి చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో నగర ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. దీనిపై ఎంపీ బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
నగరంపై చిన్నచూపు తగదు
ఏలూరుపై చిన్న చూపు తగదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదు. స్వయంగా ఆయనే స్మార్ట్ సిటీ చేస్తామని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు మొండిచెయ్యి చూపారు. అసెంబ్లీ వేదికగా బాబు చేసిన ప్రకటనతో ఆయనవన్నీ బడాయి మాటలన్న సంగతి ఏలూరు ప్రజలందరికీ తెలిసింది.
- గుడిదేశి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్
వరం దక్కని భీమవరం
భీమవరం : ఆక్వా కేంద్రంగా, జిల్లా ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న భీమవరానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. గురువారం శాసనసభలో రాజధానితో పాటు వివిధ ప్రాజెక్టులను ప్రకటించిన చంద్రబాబు భీమవరానికి ఒక్క వరం కూడా ప్రకటించకపోవడంపై పట్టణ వాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం కోట్ల రూపాయల ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతున్న భీమవరం ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం ప్రాంతానికి నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, యూనివర్సిటీ, ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులాంటివి ఏదో ఒకటి వస్తుందని ప్రజలు ఆశిస్తూ వచ్చారు. సీఎం తీరుపై తెలుగు తమ్ముళ్లు సైతం పెదవి విరుస్తున్నారు.