దత్తాత్రేయ ఇంటిని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ఐ
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై బుధవారం రాంనగర్లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ యూనివర్సిటీకి లేఖ ఇవ్వడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు యూనివర్సిటీ, ఉన్నత అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఐదుగురి సస్పెన్షన్ చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ బండారు దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, నాయకులు శివరామకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.