ఫేస్బుక్ పరిచయంతో ఘరానా మోసం
గుంటూరు: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని మోసం చేసి బంగారు బిస్కెట్ చూపించి రూ. 40 వేలు తీసుకుని పరారైన ఘటనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. సీఐ జి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మొయ్యి లక్ష్మణవర్మ సినీ రంగంలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేస్తుంటాడు. ఆయనకు ఫేస్బుక్లో సింధు అనే యువతి పరిచయమైంది. ఆమె లక్ష్మణ్‌వర్మతో మంచి సినిమా తీయించేందుకు తిరుపతికి చెందిన అజయ్‌రెడ్డి భాస్కర్‌రెడ్డిని నిర్మాతగా పరిచయం చేస్తూ ఆయన ఫోన్ నంబర్ మెసేజ్ చేసింది.
లక్ష్మణ్‌వర్మ అజయ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి అరండల్‌పేటలో ఓ ప్రైవేటు హోటల్లో కలుసుకోవల్సిందిగా చెప్పాడు. అక్కడ కలిసిన లక్ష్మణ్‌వర్మకు తాను సినిమాలకు నిర్మాతగా చేయడంతో పాటు బంగారం వ్యాపారం కూడా చేస్తానంటూ పరిచయం చేసుకున్న అజయ్‌రెడ్డి ఓ బంగారు బిస్కట్ను చూపించి కొంటారా అని అడిగారు. దాన్ని లక్ష్మణ్‌వర్మ బంగారు దుకాణానికి తీసుకెళ్లి చూపగా మంచిదేనని చెప్పారు. తనవద్ద ప్రస్తుతం రూ. 40 వేలే ఉన్నట్లు చెప్పడంతో అయితే ఆ మొత్తం తీసుకుని బిస్కెట్ కట్ చేసి తీసుకు వస్తానంటూ వెళ్లిన భాస్కర్‌రెడ్డి డబ్బుతో పరారయ్యాడు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.