భారత్‌కు రెండో గెలుపు
► కెనడాపై 3-1తో విజయం
► అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ
ఇఫో (మలేసియా): ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన భారీ ఓటమి నుంచి భారత్ తేరుకుంది. అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-1 గోల్స్ తేడాతో కెనడాను ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ తరఫున చందన నికిన్ తిమ్మయ్య, హర్మన్‌ప్రీత్ సింగ్, తల్విందర్ సింగ్ ఒక్కో గోల్ చేయగా... కెనడా జట్టుకు కీగన్ పెరీరా ఏకైక గోల్‌ను అందించాడు.
మొత్తం ఏడు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 4-1తో జపాన్‌పై, ఆస్ట్రేలియా 4-0తో పాకిస్తాన్‌పై గెలిచాయి. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది.
రియో ఒలింపిక్స్‌లో తమ గ్రూప్‌లోనే ఉన్న కెనడాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే దూకుడు కనబరిచింది. ఫలితంగా మూడో నిమిషంలో తిమ్మయ్య చేసిన గోల్‌తో ఖాతా తెరిచింది. అయితే 23వ నిమిషంలో కీగన్ పెరీరా గోల్‌తో కెనడా స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఈ క్రమంలో ఆట 41వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. 57వ నిమిషంలో తల్విందర్ సింగ్ రివర్స్ షాట్‌తో భారత్ ఖాతాలో మూడో గోల్‌ను చేర్చాడు. మిడ్ ఫీల్డ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ సర్దార్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.