త్వరలో రైల్వే ఓవర్ బ్రిడ్జి
నాగపూర్: అజ్ని స్టేషన్లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) త్వరలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)ని నిర్మించనుంది. దీని అంచనా వ్యయం రూ. 300 కోట్లు. దీని నిర్మాణం కోసం జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరాభివృద్ధి పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ ప్రతిపాదనపై ఈ నెల 21వ తేదీన జరగనున్న స్థాయీసమితి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనుంది.
కాగా అజ్ని స్టేషన్లో ఆర్ఓబీని నిర్మించాలంటూ గత రెండు సంవత్సరాలుగా ఎంపీ విలాస్ ముత్తెంవార్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ని స్టేషన్లో ఉన్న ఆర్ఓబీ 125 సంవత్సరాల క్రితం నాటిది. దీంతో మరో ఆర్ఓబీని అత్యవసరంగా నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. తుక్డోజీ పుట్లా స్వ్వేర్, వంజరి నగర్ లే అవుట్ రోడ్డు మీదుగా దీనిని చునాబట్టి ప్రాంతంవరకూ నిర్మించాలని సంబంధిత అధికారులు ప్రతిపాదించారు.
ఇందుకు సంబంధించి ఎన్ఎంసీ కన్సల్టెంట్ ఎస్.ఎన్.భోబే తదితరులు ఓ ప్రాథమిక నివేదికను రూపొందించారు. సమగ్ర ప్రాజెక్టు (డీపీఆర్) కోసం ఎన్ఎంసీ ప్రజాపనుల శాఖ త్వరలో ఓ కన్సల్టెంట్ను నియమించనుంది.