సర్కారు నౌకరి టీజర్.. ఎమోషనలైన సింగర్ సునీత
గాన మాధుర్యంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించే గాయని సునీత. తెలుగులో టాప్ సింగర్‌గా వెలుగొందుతున్న ఈమె తనయుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సర్కారు నౌకరి పేరుతో తీస్తున్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. భావనా వళపండల్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో బ్యానర్ స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా వేడుక నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. 1996లో కొల్లాపూర్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. నువ్వు చేసిన పూజలన్నీ ఫలించినయ్.. సర్కారు నౌకరున్నోడు నీ మొగుడు కాబోతుండు అన్న డైలాగ్‌తో హీరో ప్రభుత్వ ఉద్యోగి అని అర్థమవుతోంది. టీజర్ అయితే ఆసక్తికరంగా సాగింది. సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ - నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి బ్రేక్ ఇచ్చారు. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు అన్నారు.
దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ.. 'ఈ మధ్య పంచతంత్ర కథలు అనే వెబ్ సిరీస్ చేశాను. ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఆయన ఆఫీస్‌కు రమ్మని పిలిచారు. వెళ్లి కలిస్తే నేను పంచతంత్ర కథలు ఎలా మొదలుపెట్టి ఎలా ఎండ్ చేశానో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటే అది ఎక్కడికైనా చేరుతుందని అర్థమైంది. ఒక లైన్ కథ వినిపిస్తే ఆయనకు నచ్చింది. వెంటనే మా సంస్థలో చేద్దామని చెప్పారు. నాకు సర్కారు నౌకరి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెబుతున్నా' అన్నారు.
సింగర్ సునీత మాట్లాడుతూ.. 'రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. ఈ సంస్థలో డబ్బింగ్ చెప్పాం, పాటలు పాడాను, ఇది మాకు హోమ్ బ్యానర్ లాంటిది. నంది అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నా ఇంత ఎమోషనల్ కాలేదు. ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడటం ఉద్వేగంగా ఉంది. రాఘవేంద్రరావు గారు మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటుడే కాదు సంస్కారం,మంచి నడవడిక ఉన్న వ్యక్తి. అతనికి ఫ్యూచర్, కెరీర్ బాగుంటాయని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా లైఫ్ లో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావొచ్చు. ఈ సినిమాలో నేనొక ప్రమోషనల్ సాంగ్ పాడాను. సర్కారు నౌకరి సినిమా బాగా వచ్చింది' అని చెప్పింది.
చదవండి: 8 ఏళ్లకే ఇండస్ట్రీలో ఎంట్రీ.. హీరోయిన్గా మారిన డ్యాన్సర్