‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేష్ దాస్‌గుప్తా కన్నుమూత
లక్నో: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షులు, కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి అఖిలేష్ దాస్‌గుప్తా బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 56 ఏళ్ల దాస్‌గుప్తా ‘బాయ్’తో పాటు భారత ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులుగా, యూపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. 2012లో వీకే వర్మ స్థానంలో ‘బాయ్’ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2014లో మళ్లీ ఎన్నికయ్యారు. ఆయన హయాంలో దేశంలో బ్యాడ్మింటన్ క్రీడ కొంత పుంతలు తొక్కింది. థామస్, ఉబెర్ కప్ టోర్నీలకు ఆతిథ్యమివ్వడంతో పాటు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ఏర్పాటులో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.
ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ‘ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజా జీవితంలో ఆయన అందించిన క్రియాశీల సహకారం మరువలేనిది’ అని మోదీ ట్వీట్ చేశారు. దాస్‌గుప్తా మృతి భారత బ్యాడ్మింటన్‌కు తీవ్రమైన లోటు అని కేంద్ర మంత్రి విజయ్ గోయల్‌తో పాటు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, పారుపల్లి కశ్యప్ సంతాపం వ్యక్తం చేశారు.