పవన్ కళ్యాణ్ కొడుకు పేరన సినిమా నిర్మాణ సంస్థ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తరువాత ఆయన రెండవ మాజీ భార్య రేణుదేశాయ్ నిర్మాతగా మారారు. ఆమె మరాఠీ సినిమాలు నిర్మిస్తున్నారు. మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన రేణుదేశాయ్ సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. దానికి తన కుమారుడు అకీరా నందన్ పేరుపై 'అకీరా ఫిలిమ్స్' అని పేరు పెట్టారు.
సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రేణుదేశాయ్ నిర్మాతగా మారి ఇప్పటికే మరాఠీలో ‘మంగళాష్ తక్ వన్స్ మోర్’ అనే చిత్రం నిర్మించారు. సమీర్ జోషి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గత పది, పన్నెండేళ్లల్లో సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నింట్లోనూ తాను పాల్గొన్నానని రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా సినిమా మేకింగ్‌పై తనకు అవగాహన ఉందని తెలిపారు. పన్నెండేళ్ల అనుభవంతో చిత్రాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 పుట్టారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో సెన్సేషన్. పవన్‌తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్‌తోనే ‘జానీ' సినిమాలో నటించారు. వీరిద్దరికి పెళ్లి కాకముందే 2004లో అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది. నటించడం మానివేసిన తరువాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. మరాఠీలో నిర్మాతగా విజయం సాధించిన రేణు దేశాయ్ తనయుడి పేరుపై 'అకీరా ఫిలిమ్స్' ను స్థాపించారు.
s.nagarjuna@sakshi.com