భూ నిర్వాసితులకు న్యాయం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్
తిమ్మాపూర్ : జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్ డిమాండ్‌చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద వెల్గటూర్ మండలం తాళ్లకొత్తపేటకు చెందిన నిర్వాసితులకు పరిహారం అందక రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎల్ఎండీలోని ఎస్డీసీని కలిసేందుకు వచ్చిన ఆయన నిర్వాసితులతో కలిసి డెప్యుటీ తహసీల్దార్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు నిండుకుండలా కనిపిస్తుందని, ఆయన కల నెరవేరిందన్నారు. నిర్వాసితులు ఇప్పటికే గ్రామాలు ఖాళీ చేసినా వారికి ప్రస్తుత ప్రభుత్వం పరిహారం అందించడంలో జాప్యం చేస్తూ అన్యాయం చేసిందన్నారు.
నిర్వాసితులు భూములు, గ్రామాలను వదిలి వెళ్లి రెండేళ్లు గడుస్తున్నా పరిహారం ఇప్పటికీ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారని, కొందరు డబ్బులు రావనే బెంగతో చనిపోయారని తెలిపారు. నిర్వాసితులకు ఇప్పటికైనా పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించి, అన్నీ ప్యాకేజీలు వర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జాప్యం చేస్తేనిర్వాసితులతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని చెప్పారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, మండల అధ్యక్షుడు రేషవేణి వేణుయాదవ్, నాయకులు సురేందర్, జాప సతీష్‌రెడ్డి, తిరుపతి, నిర్వాసితులు లక్ష్మి, బొందమ్మ, సత్తయ్య ఉన్నారు.