'అక్షర' మూవీ రివ్యూ
టైటిల్ : అక్షర
జానర్ : క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు : నందిత శ్వేత, శకలక శంకర్, అజయ్ ఘోష్, మధునందన్, సత్య, హర్షవర్థన్ తదితరులు
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత : అల్లూరి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ
దర్శకత్వం : బి. చిన్నికృష్ణ
సంగీతం : సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : నరేశ్ బానెల్లి
విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021
హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'అక్షర'. విద్యావ్యవస్థలోని లోపాల్ని చర్చిస్తూ సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అక్షర’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
విద్యా విధాన్ అనే ప్రైవేట్ విద్యా సంస్థలో అక్షర (నందిత శ్వేత) ఫిజిక్స్ లెక్చరర్. అదే కాలేజీకి బోర్డ్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీతేజ్ (శ్రీతేజ్) తొలి చూపులోనే అక్షరతో ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉంటే అక్షర నివాసం ఉండే కాలనీకి చెందిన వాల్తేర్ బాయ్స్ మధు నందన్, సత్య, శంకర్లు ఒకరి తెలియకుండా ఒకరు ఆమెను ప్రేమిస్తుంటారు. ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాటిని ఫాలో అవుతూ అక్షరను ఇంప్రెస్ చేసే పనిలో ఉంటారు. అక్షరకు మాత్రం ఈ విషయం తెలియదు. కాలేజీకి వెళ్లడం.. టీచింగ్ అయిపోగానే లైబ్రరీలో గడపడం ఆమె దినచర్య. అలాగే విద్యావ్యవస్థపై పోరాటం చేస్తుంది.
ఈ క్రమంలో శ్రీతేజ్‌కు ఆమె దగ్గరవుతుంది. ఒక రోజు శ్రీతేజ్ తన మనసులో మాటను చెప్పేందుకు అక్షరను ఒక చోటుకు తీసుకెళ్లాడు. తన ప్రేమ విషయాన్ని తెలియజేసేలోపు అక్షర సడెన్‌గా బ్యాగులో నుంచి తుపాకి తీసి శ్రీతేజ్‌ను కాల్చేస్తుంది. అంతే కాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఆఫీసర్‌ను కూడా అక్షర చంపేస్తుంది. అసలు శ్రీతేజ్‌ని అక్షర ఎందుకు చంపేసింది? అసలు అక్షర ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? విద్యా విధాన్ ప్రైవేట్ సంస్థల యజమాని సంజయ్ స్వరూప్ అంటే అక్షరకు ఎందుకు కోపం? షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ పాత్రలు ఏమిటి అన్నదే మిగతా కథ.
నటీనటులు
ఈ సినిమాకు ప్రధాన బలం నందిత శ్వేత పాత్రే. అక్షర అనే లెక్చరర్ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించారు. ఇక విద్యా విధాన్ విద్యా సంస్థల అధినేతగా సంజయ్ స్వరూప్ తన పరిధి మేరకు నటించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే హర్షవర్థన్ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా ఆయన చక్కగా నటించాడు. అలాగే శకలక శంకర్, సత్య, మధునందన్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
ప్రైవేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ర్యాంకులు, మార్కుల కోసం కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో చూపించిన చిత్రమే అక్షర. అయితే దర్శకుడు చిన్నికృష్ణ ఎంచుకున్న కాస్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మంచి కథకు అనవసర కామెడీని జోడించి సినిమా తేలిపోయేలా చేశాడు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి కలిగించేలా చేశాడు.
అయితే అసలు కథను సెకండాఫ్‌లో చెప్పినప్పటికీ.. అక్కడ కూడా అనవసర కామెడీని చొప్పించాడు. కేసు విచారణను కూడా నాసిరకం కామెడీతో నీరుకార్చాడు. ఇక చివరి అరగంటలో వచ్చే సన్నివేశాలను సినిమాకు చాలా ప్లస్. హర్షవర్థన్ చెప్పే సంభాషణలు ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తాయి. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను చక్కగా చూపించారు. గిదుటూరి సత్య ఎడిటింగ్ అంతంత మాత్రమే ఉంది. తను చాలా సన్నివేశాల్లో తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నరేశ్ బానెల్లి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
నందిత శ్వేత నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
కథ, కథనం
అనవసరపు కామెడీ
రొటీన్ క్లైమాక్స్
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్