Aksharahasan
-
ఆయన అచ్చంగా మా నాన్నలానే!
నా వయసెంత? ఆయన వయసెంత? అయినా సరే సెట్స్‌లో నన్ను ‘జీ’ (గారు) అని గౌరవంగా పిలిచేవారు. మా నాన్న కూడా అంతే. ఎదుటి వ్యక్తి వయసు, అనుభవంతో సంబంధం లేకుండా గౌరవిస్తారు. ఆయనలో ఈ మర్యాద నాకు బాగా నచ్చేసిందంటున్నారు కమల్‌హాసన్ రెండో కుమార్తె అక్షరాహాసన్. ఎవరి గురించి చెబుతున్నారీ అమ్మాయి? అంటే... తమిళ హీరో అజిత్ గురించి! సెట్స్‌లో అజిత్ ఇతరుల్ని గౌరవించే తీరు సేమ్ టు సేమ్ మా నాన్నలానే ఉంటోందన్నారు. ‘వీరం, వేదాలం’ సినిమాల తర్వాత శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వివేకం’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఆ సంగతి తెలిసే అక్షరాహాసన్ కీలక పాత్ర నటించడానికి అంగీకరించారట. ‘‘హీరోయిన్గా నటించడం నాకిష్టమే. కానీ, నేను చేసిన రోల్ బాగుంది. ఐయామ్ హ్యాపీ’’ అన్నారు అక్షర. ఈ అమ్మాయి హిందీ సినిమాతో హీరోయిన్గా పరిచయమై, ఇప్పుడు మాతృభాష తమిళంలో సినిమా చేశారు. తమిళ సినిమాలు కంటిన్యూ చేస్తారా? అని అక్షరను అడిగితే... ‘‘నాకు భాషాబేధాలు లేవు. కొన్నాళ్లుగా నాన్నతో మాట్లాతున్నప్పుడు తమిళంలోనే మాట్లాడుతున్నా. స్పష్టంగా తమిళంలో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా. నేనెందుకు అలా చేస్తున్నానో నాన్నకు అర్థమైంది’’ అని నవ్వేశారు. సో, అక్షర మరిన్ని తమిళ సినిమాల్లో నటించాలని ఆశపడుతున్నారన్న మాట!! -
నాకు నాన్నే గుండు గీశారు
‘‘గుండు గీయించుకోవడానికి నేను రెడీ! మరి, దర్శక–నిర్మాతలు రెడీనా? నన్ను గుండుతో చూపిస్తారా?’’ అని ప్రశ్నిస్తున్నారు కమల్‌హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్. ప్రశ్నించడమే కాదండోయ్... పక్కా స్క్రిప్ట్‌తో వస్తే గుండు గీయించుకుంటానని స్పష్టం చేశారామె. సాధారణంగా అమ్మాయిలు గుండు చేయించుకోవడం అరుదు. కొందరు హీరోలు పాత్రలో పర్ఫెక్షన్ కోసం గుండు గీయించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, హీరోయిన్లు అలా చేయడం మహా అరుదు. ఈ నేపథ్యంలో అక్షర వ్యాఖ్యలు తండ్రి కమల్‌హాసన్ తరహాలో నేనూ ప్రయోగాలకు సిద్ధమనే సంకేతం అనుకోవాలేమో! అక్షరా హాసన్ మాట్లాడుతూ – ‘‘గుండుతో నటించే పాత్రల కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ, ఇప్పటివరకూ అలాంటి ఛాన్స్ రాలేదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. జుత్తుని త్యాగం చేసేస్తా’’ అన్నారు. గతంలో ఓసారి గుండు చేయించుకున్నానని ఆమె తెలిపారు. అది చేసింది కూడా ఎవరో కాదు... కమల్‌హాసనే అట! ‘‘చిన్నప్పుడు నా హెయిర్ షార్ట్‌గా ఉండేది. ఓసారి క్యాజువల్‌గా నాన్నతో ‘గుండు చేయించుకుంటే ఎలా ఉంటుంది?’ అనడిగా. వెంటనే బాత్రూమ్లోకి తీసుకువెళ్లి ఆయనే గుండు గీశారు. క్లీన్‌గా నా తలనంతా షేవ్ చేశారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. అప్పుడప్పుడూ మేం ఇలాంటి క్రేజీ థింగ్స్ చేస్తుంటాం’’ అన్నారు అక్షర.