బాగ్దాద్‌లో పేలుళ్లు: 18 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం మంగళవారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా... 50 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. బాగ్దాద్ నగరం ఉత్తర ప్రాంతమైన షబాబ్‌లో ఓ మహిళ జరిపిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు.
అలాగే రషీద్ ప్రాంతంలో కారు బాంబు పేలుడులో మరో ముగ్గురు మరణించారని చెప్పారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు. కాగా ఇరాక్‌లో గత కొన్ని రోజులుగా ఇస్లామిక్ స్టేట్ జిహాద్ గ్రూప్ ఇటువంటి దాడులకు పాల్పడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆ సంస్థే ఈ దారుణానికి పాల్పడి ఉండ వచ్చని సందేహం వ్యక్తం చేశారు. సదరు సంస్థ గత ఆరు రోజులుగా జరిపిన బాంబు పేలుళ్లలో 100 మంది దుర్మరణం పాలైయ్యారని పేర్కొన్నారు. గత గురువారం ఉత్తర బాగ్దాద్‌లో కారు బాంబు పేలి.. 94 మంది మరణించిన సంగతి తెలిసిందే.