మెట్రో పరుగు
సాక్షి, చెన్నై:చెన్నై నగరంలో ఆదివారం మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. ఒకే సమయంలో కోయంబేడు - ఆలందూరు మధ్య రెండు మార్గాల్లో రెండు రైళ్లు దూసుకెళ్లాయి. ఉదయం ఓ మారు, సాయంత్రం మరో మారు రైళ్లు దూసుకెళ్లడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మెట్రో రైలు పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కి.మీ దూరం ఓ మార్గంలో, సెంట్రల్ నుంచి కోయంబేడు మీదుగా సెయింట్ థామస్ మౌంట్ వరకు 22 కి.మీల దూరంలో మరో మార్గంలో ఈ పనులు సాగుతున్నాయి. సెంట్రల్ - కోయంబేడు - మౌంట్ మార్గంలో వంతెనల నిర్మాణం పూర్తి అయింది. ట్రాక్ ఏర్పాటు పనులు వేగవంతం చేసి ఉన్నారు. కోయంబేడు నుంచి ఆలందూరు వరకు 11 కి.మీ దూరం ట్రాక్, విద్యుద్దీకరణ పనులు ముగిశాయి. ఈ మార్గంలో ఒక రైలుతో అప్పుడప్పుడు ట్రయల్ రన్ నిర్వహిస్తూ వస్తున్నారు. నెమ్మదిగా ఈ రైలు కదులుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆదివారం మెట్రో రైలు వేగాన్ని పెంచారు.
ఒకేసారి రెండు రైళ్లు : కోయంబేడు నుంచి ఆలందరూ వరకు 11 కీ. మీద దూరంలో రాను, పోను రెండు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో సిగ్నలింగ్, విద్యుత్ సరఫరా, ట్రాక్ పరిశీలన పూర్తి అయింది. దీంతో ఈ మార్గంలో ఆదివారం ఉదయాన్నే ఏక కాలంలో రెండు రైళ్లను నడిపారు. ఇది వరకు మాదిరిగా ఆ రైలు నెమ్మదిగా కదల్లేదు. మెట్రో రైలు వేగం అంటే ఇలా ఉంటుందని నగరవాసులకు చాటే విధంగా ఒకే సమయంలో రెండు ట్రాక్‌లపై రెండు రైళ్లు దూసుకెళ్లాయి. అత్యంత వేగంతో ఈ రైళ్లు దూసుకెళ్తాండటాన్ని అటు వైపుగా వెళ్లే వారు చూడ్డానికి ఎగ బడ్డారు. సిగ్నలింగ్, విద్యుత్ పూర్తి స్థాయిలో లభిస్తుండటంతో ఇక ఈ మార్గంలో రైళ్లను నిర్భయంగా నడిపేందుకు వీలుండటంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మార్గంలో కోయంబేడు, వడపళని, అశోక్ పిల్లర్, గిండి, ఆలందూర్ వద్ద రైల్వే స్టేషన్ల పనులు ముగియాల్సి ఉంది. ఈ పనులు త్వరితగతిన పూర్తై పక్షంలో మరి కొన్ని నెలల్లో ఈ మార్గంలో పూర్తి స్థాయిలో మెట్రో రైళ్లు పరుగులు తీయడం ఖాయం.