మెట్రో చార్జీ రూ.50కి పెంపు
కేకే.నగర్: కోయంబేడు విమానాశ్రయానికి మెట్రో రైలు చార్జీలను రూ.50గా నిర్ణయించారు. చెన్నైలోని మెట్రో రైలు సేవలు మొదటి విడతగా ఆలందూర్ - కోయంబేడు మార్గంలో నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెట్రో రైలు వంతెనపైన నడుస్తున్నాయి. పది కిలోమీటర్ల దూరం గల ఈ రైలు సేవలకు ప్రారంభం రూ.10 నుంచి రూ.40గా నిర్ణయించారు. ఈ చార్జీల ధర అధికంగా ఉందని మెట్రో రైలు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇతర నగరాలలో కంటే చెన్నైలో ఈ చార్జీలు అధికంగా ఉన్నాయని ప్రజలు తెలిపారు. పలు వర్గాల వారు చార్జీలు అధికంగా ఉన్నాయని వాటిని తగ్గించాలని కోరినా మెట్రో రైలు నిర్వాహకం చార్జీలను తగ్గించలేదు.
ఈ స్థితిలో చిన్నమలై - విమానాశ్రయం మధ్య 2వ విడత మెట్రో రైలు సేవలను త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సేవలు ప్రారంభించే పక్షంలో కోయంబేడు - విమానాశ్రయం వరకు 15 కి.మీ దూరానికి కొత్త చార్జీలను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం గల చార్జీల కంటే అదనంగా రూ.10 కలిపి రూ.50గా నిర్ణయించడంపై పరిశీలనలు జరుగుతున్నాయి. దీనిపై అధికారి ఒకరు కోయంబేడు నుంచి చెన్నై విమానాశ్రయానికి వెళ్లడానికి రూ.50 చార్జీగా నిర్ణయించడం న్యాయమైన విషయమని అది ఎక్కువ ధర కాదని అన్నారు.