దక్కన్లో నేనొక్కణ్ణే...
రేడియో అంతరంగాలు
నిజాం కాలంలోని దక్కన్ రేడియోలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆలిండియా రేడియోలో సుదీర్ఘ కాలం స్టాఫ్ ఆర్టిస్ట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు పి. కుప్పుస్వామి అయ్యర్ (94). ఏడేళ్ల వయసప్పుడే వీణ, వయొలిన్ చేతపట్టిన కుప్పుస్వామి.. ప్రతి సంగీత ఉపాసకునికీ గురుభక్తి, దైవభక్తి తప్పనిసరిగా ఉండాలంటారు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ తనను కలిసినప్పుడు, ఆయన నెమరు వేసుకున్న 32 ఏళ్ల్ల రేడియో అనుభవాలు, జీవిత విశేషాలు...
ఆయన మాటల్లోనే...
త్యాగరాజుగారి శిష్యుడు కృష్ణభాగవతార్ ముని మనుమణ్ణి అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా మొదటి గురువు మా నాన్నగారు పిచ్చయ్య భాగవతార్. చెన్నైలో ఆయన దగ్గరే వీణ, వయొలిన్ నేర్చుకున్నాను. ఓ రోజు మా నాన్న నన్ను ‘‘కుప్పా! సంధ్యావందనం చేయాలి త్వరగా రా’’ అన్నారు. కంగారుగా పరుగెత్తుతూ వీణను కింద పడేశా. దాంతో అదీ పగిలింది, నన్నూ పగలగొట్టారు (నవ్వుతూ). తర్వాత కరూర్‌కి వెళ్లి గురుకులంలో చేరి శ్రీకరూర్ చిన్నస్వామి అయ్యర్ దగ్గర శిష్యరికం చేశాను. నేను సంగీతాన్ని వృత్తిగా చేసుకోవడం మా నాన్నకు ఇష్టం లేదు. కానీ ఆసక్తి మేరకు నేను ఆ రంగంలోకి వెళ్లాను.
మద్రాస్ టు హైదరాబాద్
1941లో జపాన్ వాళ్లు మద్రాసుపై రెండు బాంబులు వేశారు. అప్పుడు అక్కడి వారంతా ఎక్కడెక్కడికో వలస వెళ్లారు. మా విద్యార్థుల్లో ఓ అయ్యంగార్ కుటుంబ బంధువులు హైదరాబాద్‌లో ఉండేవారు. వాళ్ల ఇంటికి వారితోపాటు నన్నూ రమ్మన్నారు. అలా 1942లో ఇక్కడ అడుగుపెట్టాను. హిమాయత్ నగర్‌లోని వాళ్లింట్లోనే ఆరేళ్లు ఉన్నాను. నాకు తిండి పెట్టి, వసతి ఇచ్చి బాగా చూసుకునే వాళ్లు (కన్నీళ్లు పెట్టుకుంటూ).
రోజుకో గంట కార్యక్రమం
ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన చీఫ్ ఇంజినీర్ మహాలింగం గారింట్లో వాళ్ల అమ్మాయికి సంగీతం చెబుతుండేవాణ్ణి. అప్పుడు ఆయన ‘‘స్టేషన్లో వయొలిన్, మృదంగం వాయించే వాళ్లు కావాలి. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు చేసి వెళ్లండి’’ అన్నారు. నేను ట్యూషన్లు చెప్పే కీలక సమయం అది. కాబట్టి నేను రాలేనన్నాను. కానీ ఆయన పట్టు వదలకుండా అడిగే సరికి ఒప్పుకున్నాను. అలా 1947లో దక్కన్ రేడియోలో రోజూ గంట కార్యక్రమం చేయడానికి వెళ్లేవాణ్ణి. అప్పుడు హైదరాబాద్‌లో నేనొక్కణ్ణే సంగీత విద్వాంసుణ్ణి. దక్కన్ రేడియోలో రోజూ ప్రారంభంలో ఓ అయిదు నిమిషాలు వయొలిన్ వాయించేవాణ్ణి. నల్లకుంట నుంచి ఖైరతాబాద్‌కు సైకిల్‌పై వెళ్లేవాణ్ణి ఆఫీసుకు.
ఇందిరమ్మ మేలు
1950లో ఆలిండియా రేడియోను భారత ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు ఢిల్లీ నుంచి బంట్రోతు వస్తున్నాడంటే కూడా ఎంతో భయపడే వాళ్లం. ఇందిరా గాంధీ సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా జీతం రూ.160 నుంచి ఒకేసారి రూ.300లకు పెరిగింది. నేను రిటైర్ అయ్యేటప్పుడైనా అంత జీతం తీసుకుంటానా అనుకునే వాణ్ణి.
కర్ణాటక సంగీతం
నేను మొదటి నుంచీ కర్ణాటక సంగీతంపైనే సాధన చేశాను. వరదరాజన్‌గారు కర్ణాటక సంగీతానికి ప్రొడ్యూసర్‌గా ఉండేవారు. ఆయన బంగారం లాంటి మనిషి. ఎవరైనా గాయకులు చిన్న చిన్న తప్పులు చేస్తే ‘‘ఏం ఫర్వాలేదు. చిన్న తప్పే కదా’’ అనేంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మంచి స్వభావం గల పెద్ద విద్వాంసుడు. మంచాల జగన్నాథరావుగారు హిందుస్థానీ సంగీత విభాగంలో ప్రొడ్యూసర్‌గా ఉండేవారు. ఆయన వీణ వాయించేవారు. మా అందరి మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలుండేవి. నాతో పని చేసే పురుషోత్తం, జగన్నాథంతో కలిసి ఎప్పుడూ గోపీ హోటల్, అసెంబ్లీ దగ్గరుండే మైసూర్ కేఫ్‌కు వెళ్లేవాణ్ణి.
భక్తి గీతాలు
నేను భక్తి రంజని కార్యక్రమంలో ఎన్నో పాటలు పాడించేవాణ్ణి. దీపావళి, నవరాత్రి పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలు చేశాను. అంబాళి, సుబ్రహ్మణ్యస్వామి, కృష్ణుడు, శివుడు, గణపతుల పై ఎన్నో పాటలు చేశాం. నా ప్రత్యేకత వయొలిన్ వాయించడం. నా భార్య రాజ్యలక్ష్మి కూడా ఆకాశవాణిలో పాడేది. 1980లో నేను పదవీ విరమణ తీసుకున్నాను. అప్పుడే నేను నిర్వహించిన కార్యక్రమాల రికార్డులన్నీ తెచ్చుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర అవి భద్రంగా ఉన్నాయి. నాకున్న ఆసక్తితో అప్పుడప్పుడు ఆకాశవాణికి వెళ్లి ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తుంటాను.
ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల
ఫోటోలు: జి. రాజేశ్
అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అయ్యేది కాదు!
అప్పట్లో సంగీతం నేర్చుకుంటే ఏ ఉద్యోగం రాకపోయినా బతికేయొచ్చు అనే వాళ్లు.. అలాగే నేను మా గురువు చిన్నస్వామిగారి దగ్గర ఉండగానే సంగీతం నేర్పిస్తే రూ.7 సంపాదించే అవకాశం దొరికింది. దాన్ని ఆయనకు ఇస్తే నా హోటల్ ఖర్చులు అన్నీ చూసుకుంటూ నెలకు రూపాయి మిగిల్చేవాళ్లు.. ఆ తర్వాత మరో మూడు, నాలుగు ట్యూషన్లకు ఒప్పందం కుదుర్చుకున్నా. మొత్తం నెలకు రూ.22 వచ్చేవి. అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అయ్యేది కాదు. ఆ గురువుగారి దగ్గర నేను మొత్తం ఆరేళ్లు ఉన్నాను. నాకు తిండి, బట్టలు పెట్టేవారు. ఆయన రుణం నా జన్మలో తీర్చుకోలేను.