‘యూరో’ను జయించిన ‘హీరో’
కనీస కార్యాచరణ ప్రాతిపదికన ప్రారంభమైన వేదికలు ఈ రోజు లాటిన్ అమెరికాలో, గ్రీస్‌లో ఒక నూతన పంథాను ఆవిష్కరించాయి. ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా భారతదేశంలో కూడా ఒక విశాల ప్రజా ఐక్య సంఘటనకు అవకాశం ఉన్నది. దీనికి ఒక ప్రయత్నం జరగాలి. అప్పుడే పేదలను మరింత అగాధంలోకి నెడుతున్న కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థకు ముగింపు పలకడం సాధ్యమవుతుంది.
‘‘నులివెచ్చని కాంతితో మెరుస్తున్న సూర్యోదయంతో నేను ఆరోజు నిద్ర లేచాను. గ్రీస్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడటానికి పోలింగ్ జరుగుతున్న రోజు అది. మొట్టమొదటిసారిగా గ్రీస్ కార్మికవర్గం తన స్వీయ ప్రయోజనాల కోసం ఓటు వేసిన మధురమైన అనుభూతిని నేను మరచిపోలేను. దీనితో గ్రీస్‌లో నిజమైన సోషలిస్టు ప్రభుత్వం ఆవిర్భవించింది’’ అంటూ గ్రీస్ ఓటరు తన బ్లాగ్‌లో ఆనందంతో వెల్లడించిన క్షణాలవి.
యూరప్ ఖండంలో ప్రాచీన సంస్కృతీ చిహ్నమై, రాజనీతి రంగానికే అక్షరాలు దిద్దించిన గ్రీస్‌లో జనవరి 25వ తేదీన జరిగిన ఎన్నికలు చరిత్రను సృష్టించాయి. గ్రీస్ రాజకీయపటంలో అతి చిన్న పార్టీగా ఆవిర్భవించి, అనతి కాలంలోనే విస్తరించిన ‘సిరిజ’ (వామపక్ష విప్లవ సంఘటన) పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నది. ఇది సాధారణ విజయం కాదు. ఆ పార్టీ కూడా సాధారణమైనది కాదు. ఇప్పటి వరకు యూరప్‌లో, గ్రీస్‌లో కొనసాగుతోన్న వ్యవస్థలను సవాల్ చేసి నూతన లక్ష్యంతో, సోషలిస్టు ఆశయంతో ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగురవేసి చరిత్రను సృష్టించింది. దాదాపు 36.3 శాతం ఓట్లతో 149 స్థానాలను గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో 21 పార్టీలు, 4 కూట ములు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నమోదు చేసుకోగా, అక్కడి సుప్రీంకోర్టు 18 పార్టీలకు, నాలుగు కూటములకు అవకాశం కల్పించింది. గత ప్రభుత్వం లో అధికారం పంచుకున్న సోషల్ డెమోక్రటిక్ పాసొక్, న్యూడెమాక్రసీ కూట మి బాగా దెబ్బతిన్నాయి. సిరిజ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అలెక్సిస్ సిప్రాస్ జనవరి 26న ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
గ్రీస్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నది. 2013 నాటి లెక్కల ప్రకారం 65 శాతం మంది యువకులు నిరుద్యోగులే. ఎని మిది లక్షల మందికి నిరుద్యోగభృతి అందడం లేదు. ఆరోగ్య సౌకర్యాలు కూడా లేవు. నాలుగు లక్షల కుటుంబాల్లో ఒకరికి కూడా ఉపాధి లేదు. 2012 ఫిబ్రవరి అంచనాల ప్రకారం, ఇరవై వేల కుటుంబాలు నిరాశ్రయమయి నాయి. చరిత్రాత్మక ఏథెన్స్ నగరంలో 20 శాతం దుకాణాలను మూసివేశారు. కొనుగోలు శక్తి తగ్గి దుకాణదారులు దివాలా తీశారు. విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో అప్పుల భారం పెరిగిపోయింది. ముఖ్యంగా జర్మనీ నుంచి దిగుమతి అయ్యే రక్షణ ఆయుధాలు, పరికరాల కొనుగోలుతో రక్షణ బడ్జెట్ పెరిగిపోయింది. సొంత కాళ్ల మీద నిలబడి అభివృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం మానివేసి, అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేసే దుస్థితికి దిగజారింది. దీనితో ప్రభుత్వాలు పన్నుల భారాన్ని తీవ్రతరం చేశాయి. ఈ చర్యలేవీ గ్రీస్‌ను అప్పుల ఊబి నుంచి బయటపడవేయలేక పోయాయి.
2000 సంవత్సరం మొదట్లో గ్రీస్ ఆర్థిక వ్యవస్థ శక్తిమంతంగా ఉండేది. అప్పుడు ఎంతటి లోటు బడ్జెట్‌నైనా పూడ్చుకొనే శక్తి ఉండేది. కానీ నౌకా నిర్మాణ పరిశ్రమ, పర్యాటక రంగం అనుకున్నంత పురోగతి సాధించలేక పోయాయి. 1990 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ప్రపంచీకరణ ప్రభా వంతో గ్రీస్ మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. యూరో కరెన్సీ వ్యవస్థ వల్ల గ్రీస్ వివక్షకు గురైన ట్టు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో ప్రజలకు చేరేది అతి స్వల్పంగా మారిపోయింది. దీనికంతటికీ పెట్టు బడిదారీ విధానాలతో నడుస్తున్న పాలన కారణమని ప్రజలు గుర్తించారు. దానితో పెట్టుబడిదారీ విధానాలను, ప్రపంచీకరణను, ప్రజావ్యతిరేక రాజ కీయాలకు అడ్డుకట్టవేసేందుకు తీవ్రవాద వామపక్ష భావాలతో కూడిన సంస్థలు, పార్టీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించాయి. అందులో భాగం గానే 2004 ఎన్నికలకు ముందు ‘సిరిజ’ అనే వేదికను ఏర్పాటు చేసుకు న్నాయి. దీనికి మూడేళ్ల ముందే ‘స్పేస్’ అనే ఐక్య సంస్థ ఆవిర్భవించింది. స్పేస్ తర్వాత ‘సిరిజ’గా రూపుదాల్చింది. వామపక్షాల ఐక్యకార్యాచరణ, ఐక్యత కోసం ఒక చర్చావేదికగా ఇది ఆరంభమైంది. దీనిలో వివిధ సిద్ధాం తాలు, అభిప్రాయాలు కలిగిన సంస్థలు, సంఘాలు, పార్టీలు భాగస్వాముల య్యాయి. 2004 ఎన్నికలకు ముందు జనవరి 4న సాస్పిమన్, రిన్యూయింగ్ కమ్యూనిస్టు, ఎకోలాజికల్ లెఫ్ట్ (ఏకేఓఏ), ఇంటర్నేషనల్ వర్కర్స్ లెఫ్ట్, ది మూమెంట్ ఫర్ ది యునెటైడ్ ఇన్ యాక్షన్ లెఫ్ట్, యాక్టివ్ సిటిజన్స్, ఇతర వామపక్ష భావాలు కలిగిన వ్యక్తులు, సంస్థలు ఇందులో ఉన్నాయి. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎలెక్సిస్ సిప్రాస్ 2004 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏథెన్స్ నగరంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2007 సెప్టెంబర్ 16న జరిగిన ఎన్నికల్లో ‘సిరిజ’ పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. కౌన్సిలర్‌గా ఉన్నకాలంలోనే ఎలెక్సిస్ సిప్రాస్ 2008 ఫిబ్రవరిలో ‘సిరిజ’ అధ్యక్షుడయ్యారు.
2009 ఎన్నికల్లో 4.6 శాతం ఓట్లు పొంది 13 మంది ఎంపీలను ఈ పార్టీ గెలుచుకున్నది. 2012లో జరిగిన ఎన్నికల్లో 16 శాతం ఓట్లను సాధించి రెండవ పెద్ద పార్టీగా స్థానం సంపాదించింది. ఇక్కడే సిరిజ తన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించింది. పార్లమెంటులో ఐక్య సంఘటన ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించింది. ఉదారవాద ఆర్థిక విధానాలను, ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా పన్నులు విధించే విధానాలను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. మొత్తంగా యూరోకు బానిసగా ఉంటూ దేశ ప్రజల ప్రయోజ నాలను తాకట్టుపెడుతున్న పార్టీలతో జతకట్టలేమని సిప్రాస్ కరాఖండిగా చెప్పారు. దానితో సిరిజ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడమే కాక, ఉదార ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ఎన్నో ఉద్యమాలను నిర్వహించింది. ఒకవైపు ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయంగా నిలకడగలిగిన ఆర్థిక విధానాలను ప్రచా రం చేయడం, కలసివచ్చే శక్తులన్నింటినీ ఐక్యం చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందని పరిశీలకులు భావిస్తున్నారు.
సిరిజ అధికారం చేపట్టిన తర్వాత ఎలెక్సిస్ సిప్రాస్ తమ విధానాలను ప్రకటించారు. ఇవి ప్రజల్లో ఆశను రేకెత్తించాయి. ఇతర దేశాలతో, యూరో పార్లమెంట్‌తో కుదుర్చుకున్న అసమాన ఒప్పందాలను తమ ప్రభుత్వం గౌరవించదని తేల్చి చెప్పారు. సాధారణ రుణాలన్నింటినీ రద్దు చేస్తే, నిలకడ కలిగిన అభివృద్ధిని సాధించగలుగుతామని సిప్రాస్ పేర్కొన్నారు. గ్రీస్ ఇక ముందు ఎటువంటి అప్పులను అంగీకరించదని ఆర్థికమంత్రి యూనిస్ వరోఫకీస్ కూడా తేల్చి చెప్పారు.
గ్రీస్ కార్మికవర్గ ప్రజల విజయం అక్కడి ప్రజలకే కాదు ప్రపంచ ఐక్య ఉద్యమాలకు ఒక ఆశాకిరణంలా అగుపిస్తోంది. కేవలం మార్క్సిస్టు సిద్ధాం తాన్ని అమూలాగ్రం అంగీకరించిన వాళ్లే వామపక్ష శక్తులనే భావనను విడిచి పెడితే తప్ప ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరకదు. లాటిన్ అమెరికా మార్క్సిస్టు మేధావి మార్తా హర్నేకర్ మాటల్లో చెప్పాలంటే, కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీలలో ఉన్నవాళ్లు మాత్రమే వామ పక్షశక్తులు కాదనీ, బయట సామాజిక ఉద్యమాలతో ప్రపంచీకరణను వ్యతిరేకిస్తున్న శక్తులు కూడా వామపక్ష శక్తులేనని ఆమె తేల్చి చెప్పారు. పార్టీ కేడర్లు రాజకీయ వామపక్ష శక్తులైతే, సామాజిక ఉద్యమాలలో పార్టీ బయట ఉన్న వాళ్లు సామాజిక వామపక్ష శక్తులని ఆమె స్పష్టం చేశారు. అందుకే ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రతిఘటించడానికి విశాల ప్రజా ఐక్య సంఘటన అవసరం ఉంది. కనీస కార్యాచరణ ప్రాతిపదికన ప్రారంభమైన వేదికలు ఈ రోజు లాటిన్ అమెరికాలో, గ్రీస్‌లో ఒక నూతన పంథాను ఆవిష్కరించాయి. ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా భారతదేశంలో కూడా ఒక విశాల ప్రజా ఐక్య సంఘ టనకు అవకాశం ఉన్నది. దీనికి ఒక ప్రయత్నం జరగాలి. అప్పుడే పేదలను మరింత అగాధంలోకి నెడుతున్న కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థకు ముగింపు పలకడం సాధ్యం అవుతుంది. అదేవిధంగా మధ్యతరగతి వర్గానికి ఇబ్బంది కలిగించే ఆస్తి పన్నులను రద్దు చేస్తామని, అవినీతిని అంతమొందించే టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రపంచీకరణ ఊబిలో కొట్టు కుంటూ, ప్రజాధనాన్ని పెట్టుబడిదారులు, మార్కెట్ శక్తులకు ధారపోస్తున్న యూరప్ గడ్డ మీద గ్రీస్ ఒక ఆశాకిరణంలా ప్రకాశిస్తోంది.
లాటిన్ అమెరికాలో ఇప్పటికే పదికిపైగా దేశాల్లో వామపక్ష ఐక్య సంఘ టన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అదే కార్యాచరణను అనుసరించి సఫలీకృతం అయిన గ్రీస్ మరోసారి విశాల ప్రజా ఐక్య సంఘటన విధానాన్ని విజయమార్గంగా రుజువు చేసింది.
చివరగా ఒక విషయం ప్రస్తావించాలి. గ్రీస్‌లో విజయం సాధించిన సిరిజ పార్టీ అంతర్జాతీయంగా ఎన్నో సమావేశాల్లో పాల్గొని తమ ఐక్య సంఘ టన విధానాలను వివరించింది. సెంటర్ ఫర్ దళిత స్టడీస్, తెలంగాణ విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో 2014 మార్చి 7 నుంచి 10 వరకు హైదరా బాద్‌లో జరిగిన ‘సోషలిజం ప్రజాస్వామ్యం’ అనే అంతర్జాతీయ సదస్సుకు సిరిజ ప్రతినిధి యానిస్ అలంపైన్ హాజరయ్యారు. ఆ నాలుగు రోజుల్లో ప్రపంచీకరణ దుష్పరిణామాలు, వాటి ప్రత్యామ్నాయాలపై జరిగిన చర్చలో యానిస్ అలంపైన్ తమ దేశ అనుభవాలను వివరించారు. ఆ సదస్సులో పాల్గొనే భారతదేశ ప్రతినిధులకు, ఇతర దేశాల నాయకులకు గ్రీస్ విప్లవ వామపక్ష శక్తుల విజయం ఒక గొప్ప స్ఫూర్తి కావాలి. అదే స్ఫూర్తితో ప్రపం చాన్ని కబళిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమ నిర్మాణానికి మరింత సంఘటితంగా పని చేయాలి.
కొత్త కోణం: మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213)