స్నాప్‌డీల్ ఇన్స్టంట్ డిస్కౌంట్
ముంబై: నల్లధనానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 500, 1000 నోట్ల ఉపసంహరణ ప్రకటనతో ఈకామర్స్ సంస్థలుకూడా స్పందిస్తున్నాయి. నిన్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన క్యాష్ ఆన్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తే స్నాప్ డీల్ మాత్రం విభిన్నంగా స్పందించింది. ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాలెట్ ఆన్ డెలివరీ లో అన్ని రకాల కార్డుల లావాదేవీలపై తక్షణం 10శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. పరిమితి కాలానికి అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సదుపాయంలో 5వేల రూపాయల కొనుగోలుపై సుమారు 500 వరకు డిస్కౌంట్ లభించనున్నట్టు సంస్థ ప్రకటించింది.
నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుగా వీలుగా కొన్ని రకాల స్మార్ట్ఫోన్లతో సహా, ఇతర ఉత్పత్తుల అమ్మకాలపై అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై 10 శాతం 'తక్షణ డిస్కౌంట్' అందిస్తోంది. వెబ్ లేదా మొబైల్ ఆప్ ద్వారా చెల్లుబాటు అయ్యేలా ఉన్న ఈ ఆఫర్ నవంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు ఈఎంఐ ఆప్షన్‌తో చేసే కొనుగోళ్లకు కూడా ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నట్టు స్నాప్ డీల్ ఒక ప్రకటనలో తెలిపింది.