'రేషన్ డీలర్ల కమిషన్ పెంచాలి'
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : రేషన్ డీలర్లకు ప్రభుత్వం వెంటనే కమిషన్ పెంచాలని, లేదంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు, ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల సమాఖ్య ఉపాధ్యక్షుడు ప్రహ్లాద్ భాయి మోదీ డిమాండ్ చేశారు. మంగళవారం నగరానికి విచ్చేసిన ఆయన చాంద్రాయణగుట్టలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాకర్షణ సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తోందని కితాబునిచ్చారు.
అందరి సమస్యలను పరిష్కరిస్తున్న తెలంగాణ సర్కార్ రేషన్ డీలర్ల సమస్యలను మాత్రం విస్మరిస్తోందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఆయన దేవీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.