స్వర నేత్రుడు
మిణుగురులు
సమాజానికి దివిటీలు
-నిర్మలారెడ్డి
చదువుకునే రోజుల్లోనే చూపును కోల్పోయిన దేవరకొండ వెంకట మోహనకృష్ణ (50) ఆ సమస్యను అధిగమించి తన జీవితాన్ని మలుచుకున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమైనది.
మోహనకృష్ణ మూడో తరగతిలో ఉన్నప్పుడు కామెర్లు వచ్చాయి. పసరు వైద్యం చేస్తే అది వికటించింది. కంటి రెటీనా పై పిగ్మెంటేషన్ ప్రారంభమై... క్రమక్రమంగా డిగ్రీ ఫైనలియర్కి వచ్చేటప్పటికి కంటిచూపు పూర్తిగా పోయింది.
అయినా అధైర్యపడకుండా తల్లిదండ్రుల నుంచి అబ్బిన సంగీతాన్ని తన జీవితానికి చూపుగా మార్చుకున్నారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ శిష్యుడిగా చేరారు. ఏన్నో వేదికల మీద పాటలు పాడారు. ఆ తర్వాత విజయవాడ ఆలిండియా రేడియో ఉద్యోగి అయ్యారు. ‘‘అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు పిల్లలు... ఇదీ నా కుటుంబం. ఆసక్తి గలవారు వచ్చి నా దగ్గర సంగీతపాఠాలు నేర్చుకుంటారు. విదేశాలలో ఉన్న సంగీతాభిమానులు ఆన్లైన్లోనూ తరగతులు చెప్పమని అడుగుతుంటారు. ‘భగవంతుడు నీకు అన్యాయం చేశాడు!’ అనేవారు దగ్గరివాళ్లు. కానీ, నేనలా అనుకోలేదు. దేవుడు ఒకటి తీసుకున్నా ఇంకోటి ఇచ్చాడనుకుంటాను. సంగీతం ద్వారా ఎందరికో నన్ను చేరువచేశాడు. ఇప్పటి వరకు నాలుగు వందల మందికి సంగీతం నేర్పించి ఉంటాను. అందరికీ ఉచితంగా నేర్పించనేర్పిస్తున్నాను’’ అని తెలిపారు మోహనకృష్ణ.
ఒక దారి మూసుకుపోతేనేం, వంద దారులు తెరుచుకునే ఉంటాయి. వాటిని మనోదృష్టితో చూడాలి. దారిని ఎంపిక చేసుకోవాలి. ఆ దారిలో గమ్యం చేరుకోవాలి. అర్ధంతరంగా చూపును కోల్పోయినా మరో అవకాశాన్ని అందిపుచ్చుకొని జీవితాన్ని మలుచుకున్న మోహన్కృష్ణలాంటి వాళ్లు సమాజానికి దివిటీల వంటివారు.
ఫొటో: జి.రాజేష్
- బాలు, సాక్షి, విశాఖపట్నం